సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఎన్నికల వేళ దగ్గర పడుతున్న కొద్దీ కొత్తకొత్త వార్తలు ఆసక్తి పుట్టిస్తున్నాయి. రాజకీయంగా ఏ సమీకరణాలతో ఓ నిర్ణయానికి వస్తున్నారో కానీ, పలువురు నేతలు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. తెలంగాణవాదం బలంగా ఉందని భావిస్తున్న ఈ ప్రాంతాన్నే ఎంచుకోవడం విశేషం. భువనగిరికి కాంగ్రెస్ తరఫున సిట్టింగ్ ఎంపీగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఉన్నా, అదే పార్టీకి చెందిన పలువురు ఇదే స్థానాన్ని ఆశిస్తుం డడం గమనార్హం.
జనగామ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఈసారి భువనగిరి ఎంపీగా పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. జనగామ నుంచి తన కోడలు పొన్నాల వైశాలిని బరిలోకి దింపితే తాను భువనగిరికి వస్తానని ఈ ప్రాంత నేతలతో ఇప్పటికే ఆయన మంతనాలు కూడా జరిపారని సమాచారం. అలా కుదరని పక్షంలో తన కోడలినైనా ఇక్కడి నుంచి పార్లమెంటుకు పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
అదే మాదిరిగా, గతంలో వరంగల్ జిల్లా చేర్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా పనిచేసి, ప్రస్తుతం బీజేపీ తీర్థం పుచ్చుకున్న కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి సైతం అవసరమైతే బీజేపీ అభ్యర్థిగా భువనగిరి లోక్‌సభస్థానం నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారని సమాచారం. మరోవైపు ఇదే లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని తుంగతుర్తి అసెంబ్లీ సెగ్మెంటు నుంచి వరంగల్ జిల్లాకే చెందిన టీఆర్‌ఎస్ నేత కడియం శ్రీహరి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతూనే ఉంది. కాకపోతే, జిల్లా టీఆర్‌ఎస్ వర్గాలు, నాయకులు మాత్రం అలాంటిదేమీ లేదన్న జవాబిస్తున్నారు.
జిల్లా టీడీపీకి... కొంత ఊరట
ఇపుడు తాజాగా, టీ టీడీపీ ఫోరం కన్వీనర్, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ‘భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తా..’ అని ప్రకటించారు. ఈ ప్రకటన జిల్లా టీడీపీ వర్గాలకు కొంత ఊరట ఇచ్చే అంశమే. గత ఎన్నికల్లో జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న ఆ పార్టీకి పరిస్థితి జిల్లాలో దయనీయంగా తయారైంది. ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా విడిపోవడం, గ్రూపు తగాదాలను పరిష్కరించి, పార్టీని గాడిలో పెట్టడంలో అధినేత విఫలం కావడంతో టీడీపీ శ్రేణులను నిస్తేజం ఆవరించింది.
వాస్తవానికి ఆ పార్టీకి పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులే కనిపించడం లేదు. నల్లగొండ లోక్‌సభాస్థానానికి నాగార్జునసాగర్ ఇన్‌చార్జ్ తేరా చిన్నపురెడ్డి పేరు ఓసారి వినిపించింది. అయినా, ఆయన సాగర్ అసెంబ్లీ స్థానం నుంచే పోటీకి సుముఖంగా ఉండి, ఆ మేరకు ఇప్పటికే పర్యటనలు మొదలు పెట్టారు. ఇక, భువనగిరి లోక్‌సభా స్థానానికి పోటీ చేసేందుకు ఇటీవల కాలంలో ముందుకు వచ్చిన నాయకుడు ఒక్కరూ లేరు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఎర్రబెల్లి దయాకర్‌రావు భువనగిరి నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంపై చర్చ జరుగుతోంది.
కారణం... ఏంటబ్బా..!
అయితే, ఎర్రబెల్లి ఈ ప్రకటన చేయడం వెనుక ఉన్న కారణాలపై జిల్లా టీడీపీ నేతలు సైతం స్పష్టమైన సమాధానం చెప్పలేకపోతున్నారు. గత ఎన్నికల ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే...
భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని భువనగిరి, తుంగతుర్తి అసెంబ్లీ సెగ్మెంట్లు ప్రస్తుతం టీడీపీ చేతిలో ఉన్నాయి.
గతంలో ఆలేరు నుంచి రికార్డు సంఖ్యలో టీడీపీ గెలిచిన చరిత్ర ఉంది.
మునుగోడు అసెంబ్లీ సెగ్మెంటులో బలమైన ఓటు బ్యాంకు ఉందని టీడీపీ నాయకత్వం భావిస్తోంది.
తెలంగాణవాదం బలంగా ఉన్న ఈప్రాంతం నుంచి బరిలోకి దిగితే, టీడీపీలో తెలంగాణవాణిని బలంగా వినిపించిన నేతగా ముద్ర ఉన్నం దున తనకు కలిసి వస్తుందని భావించడం.
ఇలా... ఎవరి విశ్లేషణ వారు ఇస్తున్నారు. అయితే, పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైన ఈ పరిస్థితుల్లో చేసిన ఈ ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి భువనగిరి పార్లమెంటు స్థానం ‘హాట్ సీటు’గా మారడం విశేషం.
భువన‘గురి’
Published Sat, Jan 25 2014 2:30 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement