సైకిల్ రెండు టైర్లూ పంక్చర్: మంత్రి హరీశ్ రావు
నారాయణఖేడ్: సైకిల్ పంక్చర్ అయి తుప్పు పట్టిపోయిందని, ఆ పార్టీ గురించి మాట్లాడటం అనవసరమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలంలో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ ఆంధ్రాకు వెళ్లిపోయిందని, ఆ పార్టీ గుర్తు సైకిల్ దారితప్పి తుప్పుపట్టిందని ఎద్దేవా చేశారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో గతంలో ఎన్నికలు వస్తే పటేళ్ల ఇళ్లకు వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్లిపోయే వారని, పైగా బెదించి ఓట్లేయించుకొన్నారని ఆరోపించారు. వినని వారిని ఇబ్బందులు పెట్టారని, వారి అన్నదమ్ములు, భార్యాభర్తలకు, గట్టు పంచాయతీలు పెట్టి పోలీస్స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిప్పడానికే పరిమితమయ్యారని అన్నారు.