bidhala Jeevan Reddy
-
సేవాయువకులు
నవతరం దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లో విస్తరించిన సేవాసంస్థ... గ్రీన్‌నెస్ట్. ‘బుక్వింగ్స్’, ‘గో గ్రీన్’ అనేవి ఈ సంస్థ విభాగాలు. అనాథాశ్రమాల్లోని విద్యార్థులకు ఇంగ్లిష్ భాషను బోధించడం బుక్వింగ్స్ బృందం లక్ష్యం కాగా, ప్రజల్లో పర్యావరణ స్పృహను పెంపొందించడం గ్రో గ్రీన్ ఉద్దేశం. బీదాల జీవన్‌రెడ్డి ప్రాథమిక దశలో ఇంగ్లిష్‌లో చదువుకోవడానికి అవకాశం లేని వాళ్లు ఎంతోమంది. అలాంటి వారికి, తనకు చేతనైనంత మేరకు ఇంగ్లిష్ బోధనను అందించాలని పృథ్వితేజ్ తాళ్లూరి అనే యువకుడు భావించాడు. అలా పృథ్వికి తోడైన వాళ్లు... జయదీప్‌రెడ్డి, జాయ్, రాఘవేంద్ర, శ్రీవాణి, లహరి, గుణశేఖర్, మౌనిక, కార్తీక్, నిఖిల్, అమోల్, మహిమా భరద్వాజ్ తదితరులు. వీళ్లందరి ఆధ్వర్యంలోనే ‘గ్రీన్‌నెస్ట్’ సంస్థ నడుస్తోంది. ఇంగ్లిష్ చదవడం, మాట్లాడ్డం తెలియకపోవడం వల్ల, దాన్ని బోధించే వాళ్లు లేకపోవడం వల్ల చాలా మంది అనాథలు, మురికివాడల్లోని పిల్లలకు ప్రపంచం సరిగా పరిచయం కావడం లేదని జయదీప్ అంటాడు. ఆ లోటును భర్తీ చేయడానికి తమకు చేతనైనంతలో ప్రణాళిక బద్ధంగా పని చేస్తున్నారు. హైదరాబాద్‌లోని కొన్ని అనాథశ్రమాలను ఎంచుకుని, అక్కడికి తమ వలంటీర్లను పంపుతోంది బుక్ వింగ్స్. వాళ్లు వెళ్లి, సిలబస్ ప్రకారం అక్కడి పిల్లలు ఇంగ్లిష్‌ను అభ్యసించేలా చూస్తున్నారు. గ్రీన్‌నెస్ట్ నేతృత్వంలో ప్రస్తుతం 120 మంది వరకూ వలంటీర్లు పనిచేస్తున్నారు. వారిలో సగం మంది బుక్ వింగ్స్ ఆధ్వర్యంలో ఇంగ్లిష్ బోధనకు, మిగతా సగం గో గ్రీన్ ఆధ్వర్యంలో పర్యావరణ స్పృహను పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. గోగ్రీన్ వలంటీర్లు నగరంలో జనసమ్మర్ధం ఉన్న ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. పారిశుధ్య పనులను చేపడుతుంటారు. ప్రస్తుతం అనేక మంది స్వచ్ఛభారత్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారని చెబుతూ,ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం నగరంలోని ఏదో ఒక మూల తమ సభ్యులు నిర్వహిస్తుంటారని గ్రీన్‌నెస్ట్ వ్యవస్థాపక సభ్యులయిన జాయ్, రాఘవేంద్రలు వివరించారు. అలాగే ప్లాస్టిక్ వినియోగ వ్యతిరేక ఉద్యమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రత్యేక శ్రద్ధతో ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేయిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుణె, ఢిల్లీ, ముంబాయి నగరాల్లో జరుగుతున్న తమ సేవాకార్యక్రమాలను మున్ముందు మరిన్ని నగరాలకు విస్తరించే ఉద్దేశం ఉందని చెప్పారు. విద్యార్థులే వలంటీర్లు హైదరాబాద్‌నే తీసుకొంటే.. ఇక్కడ ఎక్కువ మంది వలంటీర్లు ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుకుంటున్నవాళ్లే. ప్రతి ఆదివారం వీరంతా గ్రీన్‌నెస్ట్ ద్వారా సేవలను అందించడానికి కొన్ని గంటల సమయాన్ని కేటాయిస్తున్నారు. ఎవరె వరు ఎక్కడ ఏయే కార్యక్రమాలను చేపట్టాలనే సమాచారం వీరికి గ్రీన్‌నెస్ట్ గ్రూప్ నుంచి అందుతుంది. ఫేస్బుక్, వాట్సప్‌లు ఇందుకు బాగా ఉపయోగపడుతున్నాయి. తమ కార్యక్రమాలు నచ్చి అనేకమంది తమతో కలిసి పనిచేసేందుకు ఉత్సాహం చూపుతున్నారని,అయితే వారిని ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని విధివిధానాలు పాటిస్తున్నామని గ్రీన్‌నెస్ట్ సభ్యులు తెలిపారు. సమాజ సేవ విషయంలో వారి దృక్పథాలను దగ్గరగా పరిశీలించాక మాత్రమే చేర్చుకోవడం జరుగుతుందని చెప్పారు. ఇటీవలే డిసెంబర్ 21న ఈ సంస్థ కొత్తగా వలంటీర్లను చేర్చుకోవడంపై ప్రత్యేక సమాలోచనను నిర్వహించింది. అప్పటికే వారి దగ్గర 1200 పైగా దరఖాస్తులు సిద్ధంగా ఉన్నాయి. విద్యార్థి దశలోనే ఇలాంటి కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనడం వల్ల నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని కోర్ గ్రూప్ సభ్యులు అభిప్రాయపడ్డారు. డ్రైవర్ అవుతానన్నాడు! మురికివాడలలోకి వెళ్లినప్పుడు అక్కడ పిల్లలతో మాట్లాడితే చాలా ఆశ్చర్యం కలుగుతుంటుంది. అలా ఒక పిల్లాడితో మాట్లాడుతూ పెద్దయ్యాక నువ్వు ఏమవుతావు? అని అడిగితే డ్రైవర్ అవుతానన్నాడు. ఎందుకలా అంటే, నాకు ఇంగ్లిష్ రాదు, అంతకు మించి ఏం కాగలను? అని ఆ పిల్లాడు ప్రశ్నించాడు! రెండేళ్లుగా అలాంటి పిల్లలకు ఇంగ్లిష్ బోధిస్తున్నాం. ఇప్పుడు వారి ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది. - రాఘవేంద్ర, గ్రీన్‌నెస్ట్ సభ్యుడు చొరవలేక ఆగిపోతున్నారు! మనలో చాలామందికి సామాజిక సేవ మీద ఆసక్తి ఉంది. అయితే వీధి చివర్లో ఉన్న చెత్తను తొలగించడానికి, అశుభ్రతతో ఉన్న పరిసరాలను పరిశుభ్రం చేయడానికి చొరవ చూపలేకపోతున్నామని మాతో కొంతమంది స్పష్టంగా చెప్పారు. ఎలాంటి బిడియం, సంశయం లేకుండా పరిసరాలను శుభ్రం చేస్తున్న మమ్మల్ని వారు అభినందిస్తున్నారు. మెల్లిగా మా వైపు వస్తున్నారు. - జయదీప్‌రెడ్డి, గ్రీన్‌నెస్ట్ అధ్యక్షుడు -
విజయానికి క్లాప్ కొట్టారు..!
హిట్టైన సినిమాల, ట్రెండ్‌ను సృష్టించిన సినిమాపాత్రల, స్టార్ల పేరుతో బట్టలు అమ్మడం... చాలా పాత మార్కెటింగ్ టెక్నిక్. మరి టెక్నిక్ పాతది అయినా... మార్కెట్ సృష్టించుకోవడానికి ఇదొక ఊటలాంటిది. జనాల ఆసక్తుల, అభిరుచుల, ఇష్టాలతో ముడిపడిన ఈ పద్ధతిని అనుసరిస్తే వాళ్లకు దగ్గరకావొచ్చు, మార్కెట్‌ను చాలా సులభంగా విస్తృతపరుచుకోవచ్చు. ప్రస్తుతం ఈ విధంగా విజయపథాన దూసుకుపోతున్నారు ఇద్దరు యువకులు. హీరోలు, హీరోయిన్లు సినిమాల్లో ధరించిన డిజైనర్‌వేర్‌లను పోలిన డ్రస్సులను తయారు చేసి అమ్మడమే వీరి వ్యాపారం. ఆన్లైన్ ద్వారానే సాగుతున్న వీరి వ్యాపారానికి ఇప్పుడు మంచి స్పందన లభిస్తోంది. ఆసక్తికరమైన నేపథ్యంతో ఆసక్తికరమైన వ్యాపారం చేస్తున్న ఆ యువకులు చిన్మయ్ రాజుల, మామిడి రాజాలు. వారి గురించి, వారి ‘క్లాప్ వన్’ గురించి... సమంత ధరించిన ఈ కుర్తీనే ఈ సరికొత్త వ్యాపారానికి పునాది వేసింది అన్నింటికంటే బాగా అమ్ముడయినవి ‘రేసుగుర్రం షర్ట్స్’ వీరికి వస్తున్న ఆర్డర్లలో అమ్మాయిలు చేస్తున్నవే ఎక్కువ ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాలో రాశిఖన్నా ధరించిన హెవీవర్క్ శారీలకు ఎనలేని డిమాండ్ ఉంది ఈగ సినిమాలో సమంత ధరించిన కుర్తీ డిజైన్ కూడా బాగా అమ్ముడయ్యింది. బీటెక్ చ దివిన ఈ ఇద్దరూ అందరు గ్రాడ్యుయేట్లలా ఉద్యోగాన్వేషణలో పడలేదు. ఉద్యోగం చేయడం, ఎవరికో సమాధానంగా ఉండటం కంటే.. సొంతంగా ఏదైనా వ్యాపారాన్ని వృద్ధి చేసుకొని వెలుగులోకి రావాలని భావించారు. మరి వ్యవసాయ కుటుంబ నేపథ్యం... ఏదో వైవిధ్యం చూపితేనే వ్యాపారరంగంలో నిలదొక్కుకోగలిగేది. ఇలాంటి తరుణంలో చిన్మయ్, రాజాల మెదడులో మెదిలిన ఆలోచనే ‘క్లాప్వన్’. ‘ఈగ’ సినిమాలో హీరోయిన్ సమంత ధరించిన కుర్తీలాంటిదే తనకూ కావాలని అడిగిందట చిన్మయ్ చెల్లెలు. ఈగ హిట్ సినిమా కాబట్టి అలాంటి డిజైన్‌తోనే తయారు చేసిన కుర్తీ ఎక్కడో ఒక చోట దొరక్కపోదా అనుకొని దాన్ని కొనడానికి స్నేహితులిద్దరూ బయలేదేరారట. అయితే జంటనగరాల పరిధిలోని అన్ని ప్రముఖషాప్లలోనూ గాలించినా అలాంటి కుర్తీ లభించలేదట! చెల్లెలి కోసం అంతగా తిరిగినా లభించకపోవడం నిరాశ కలిగించింది. అయితే... మార్కెట్లో ఇలాంటి ఒక వ్యాక్యూమ్ ఉందని ఈ స్నేహితులకు అర్థం అయ్యింది. ఇంకేముంది అలాంటి శూన్యతను ఆధారంగా చేసుకొనే తమ వ్యాపారాన్ని మొదలు పెట్టాలని భావించారు. అలా అనుకొని ‘క్లాప్వన్’ ను మొదలు పెట్టారు. ‘క్లాప్’ అనేది సినిమా రంగానికి చెందిన పదం. ఇలా సినిమా స్టార్ల డిజైనర్ వేర్లను పోలిన డ్రస్సులను అమ్మే తొలిషాప్ మాదే.. అనే విషయాన్ని చెబుతూ దానికి ‘వన్’ను జత చేశామని వీరు చెప్పారు. ఆన్లైన్ ద్వారా ఆర్డర్లు తీసుకోవడం కోరిన విధమైన డిజైనర్‌వేర్‌లను తయారు చేసి కొరియర్ సర్వీస్ ద్వారా డెలివరీ చేయడం. కొంత మూలధనాన్ని పెట్టి చిన్మయ్, రాజాలు ఈ వ్యాపారం మొదలు పెట్టారు. ఇంజనీరింగ్ నేపథ్యం ఉంది కాబట్టి.. స్నేహితుల ద్వారా కావాల్సినంత ప్రచారం వచ్చింది. వీళ్ల కాన్సెప్ట్‌ను విని డ్రస్సింగ్ విషయంలో సినిమా వాళ్లను అనుకరించే ఆసక్తి ఉన్న అనేక మంది యువతీయువకులు కోరి మరీ డ్రస్సులను డిజైన్చేయించుకొన్నారు. అలా ఒకరి నుంచి ఒకరికి సాగిన ప్రచారంతో క్లాప్వన్కు మంచి గుర్తింపు దక్కింది. ఫేస్బుక్, ఆన్లైన్ ప్రచారం ఉండనే ఉంది. దీంతో కొన్ని నెలల్లోనే క్లాప్వన్కు మంచి గుర్తింపు వచ్చింది. దాదాపు మూడువేల మంది కస్టమర్లు తయారయ్యారు! యువతలో సినిమా వాళ్ల డ్రస్సులపై ఉన్న ఆసక్తే వీరి వ్యాపారానికి మూలాధారం.‘‘మేము డిజైన్‌చేసే దుస్తులను ‘ఇన్స్పైర్డ్ కలెక్షన్స్’అని చెప్పవచ్చు. సినిమాల్లో హీరో హీరోయిన్లు ధరించిన దుస్తుల మోడల్‌ను మేము సంపాదించి వాటి తరహాలోవి తయారు చేస్తాం. దీనికోసం సినిమా వాళ్లను కలుస్తాం. వారితో ఒప్పందాన్ని కుదుర్చుకొని దుస్తులను డిజైన్ చేస్తాం. డిజైనింగ్ కోసం మా దగ్గర నిపుణులున్నారు. యువతలో బాగా ఆసక్తి రేకెత్తించిందన్న సినిమా డిజైనర్వేర్లనే మేము తయారు చేస్తాం. మా దగ్గర ఉన్న కలెక్షన్ల వివరాలు అన్నీ క్లాప్వన్ వెబ్సైట్లో ఉంటాయి. వాటిని చూసి ఆర్డర్ చేస్తే.. వారం రోజుల్లోగా డెలివరీ చేస్తాం..’’అంటూ తమ వ్యాపార వివరాలను చెబుతారు చిన్మయ్. ధరల విషయానికి వస్తే సినిమాలో స్టార్లు ధరించే దుస్తుల విలువ పదివేలపైమాటేనట. అయితే వాటికి నకలుగా వీరి దగ్గర లభించే దుస్తులు వాటి స్థాయిని బట్టి 499 రూపాయల నుంచి తొమ్మిదివేల రూపాయల వరకూ అందుబాటులో ఉంటాయి. సొంతంగా ఒక బ్రాండ్‌ను సృష్టించుకోవడమే తమ లక్ష్యమని అంటారు ఈ స్నేహితులు. ఇప్పుడు అనేక మంది పెట్టుబడిదారులు తమతో చేతులు కలపడానికి వస్తున్నారని... ఆ శక్తిని కలగలుపుకొని మరింత వ్యాపారాభ్యున్నతిని సాధిస్తామని వీరు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలపై ఆసక్తి అనేది యువతలో ఎన్నటికీ కొనసాగుతూ ఉండే దే. సినిమా వాళ్లను ఆనుకరించేం దుకు ఆసక్తి చూపే వారు ప్రతి తరంలోనూ ఉంటారు. కాబట్టి ‘క్లాప్వన్’ వ్యాపారానికి ఎప్పటికీ మార్కెట్ ఉంటుంది. తద్వారా ఈ యువకులిద్దరూ తమకంటూ సొంత బ్రాండ్నొకదానిని నెలకొల్పాలన్న తమ లక్ష్యాన్ని సాధించే దిశలోనే పయనిస్తున్నారు. - బీదాల జీవన్‌రెడ్డి