సేవాయువకులు | 'Green Nest 'organization | Sakshi
Sakshi News home page

సేవాయువకులు

Published Mon, Dec 29 2014 12:15 AM | Last Updated on Sat, Sep 2 2017 6:53 PM

సేవాయువకులు

సేవాయువకులు

నవతరం
దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లో విస్తరించిన సేవాసంస్థ... గ్రీన్‌నెస్ట్. ‘బుక్‌వింగ్స్’, ‘గో గ్రీన్’ అనేవి ఈ సంస్థ విభాగాలు. అనాథాశ్రమాల్లోని విద్యార్థులకు ఇంగ్లిష్ భాషను బోధించడం బుక్‌వింగ్స్ బృందం లక్ష్యం కాగా, ప్రజల్లో పర్యావరణ స్పృహను పెంపొందించడం గ్రో గ్రీన్ ఉద్దేశం.
 
బీదాల జీవన్‌రెడ్డి
ప్రాథమిక దశలో ఇంగ్లిష్‌లో చదువుకోవడానికి అవకాశం లేని వాళ్లు ఎంతోమంది. అలాంటి వారికి, తనకు చేతనైనంత మేరకు ఇంగ్లిష్ బోధనను అందించాలని  పృథ్వితేజ్ తాళ్లూరి అనే యువకుడు భావించాడు. అలా పృథ్వికి తోడైన వాళ్లు... జయదీప్‌రెడ్డి, జాయ్, రాఘవేంద్ర, శ్రీవాణి, లహరి, గుణశేఖర్, మౌనిక, కార్తీక్, నిఖిల్, అమోల్, మహిమా భరద్వాజ్ తదితరులు. వీళ్లందరి ఆధ్వర్యంలోనే ‘గ్రీన్‌నెస్ట్’ సంస్థ నడుస్తోంది.
 
ఇంగ్లిష్ చదవడం, మాట్లాడ్డం తెలియకపోవడం వల్ల, దాన్ని బోధించే వాళ్లు లేకపోవడం వల్ల చాలా మంది అనాథలు, మురికివాడల్లోని పిల్లలకు ప్రపంచం సరిగా పరిచయం కావడం లేదని జయదీప్ అంటాడు. ఆ లోటును భర్తీ చేయడానికి తమకు చేతనైనంతలో ప్రణాళిక బద్ధంగా పని చేస్తున్నారు. హైదరాబాద్‌లోని కొన్ని అనాథశ్రమాలను ఎంచుకుని, అక్కడికి తమ వలంటీర్లను పంపుతోంది బుక్ వింగ్స్. వాళ్లు వెళ్లి, సిలబస్ ప్రకారం అక్కడి పిల్లలు ఇంగ్లిష్‌ను అభ్యసించేలా చూస్తున్నారు.

గ్రీన్‌నెస్ట్ నేతృత్వంలో ప్రస్తుతం 120 మంది వరకూ వలంటీర్లు పనిచేస్తున్నారు. వారిలో సగం మంది బుక్ వింగ్స్ ఆధ్వర్యంలో ఇంగ్లిష్ బోధనకు, మిగతా సగం గో గ్రీన్ ఆధ్వర్యంలో  పర్యావరణ స్పృహను పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. గోగ్రీన్ వలంటీర్లు నగరంలో జనసమ్మర్ధం ఉన్న ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. పారిశుధ్య పనులను చేపడుతుంటారు.

ప్రస్తుతం అనేక మంది స్వచ్ఛభారత్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారని చెబుతూ,ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం నగరంలోని ఏదో ఒక మూల తమ సభ్యులు నిర్వహిస్తుంటారని గ్రీన్‌నెస్ట్ వ్యవస్థాపక సభ్యులయిన జాయ్, రాఘవేంద్రలు వివరించారు. అలాగే ప్లాస్టిక్ వినియోగ వ్యతిరేక ఉద్యమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రత్యేక శ్రద్ధతో ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేయిస్తున్నామని చెప్పారు.   ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుణె, ఢిల్లీ, ముంబాయి నగరాల్లో జరుగుతున్న తమ సేవాకార్యక్రమాలను మున్ముందు మరిన్ని నగరాలకు విస్తరించే ఉద్దేశం ఉందని చెప్పారు.
 
విద్యార్థులే వలంటీర్లు
హైదరాబాద్‌నే తీసుకొంటే.. ఇక్కడ ఎక్కువ మంది వలంటీర్లు  ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుకుంటున్నవాళ్లే.  ప్రతి ఆదివారం వీరంతా గ్రీన్‌నెస్ట్ ద్వారా సేవలను అందించడానికి కొన్ని గంటల సమయాన్ని కేటాయిస్తున్నారు. ఎవరె వరు ఎక్కడ ఏయే కార్యక్రమాలను చేపట్టాలనే సమాచారం వీరికి గ్రీన్‌నెస్ట్ గ్రూప్ నుంచి అందుతుంది. ఫేస్‌బుక్, వాట్సప్‌లు ఇందుకు బాగా ఉపయోగపడుతున్నాయి. తమ కార్యక్రమాలు నచ్చి అనేకమంది తమతో కలిసి పనిచేసేందుకు ఉత్సాహం చూపుతున్నారని,అయితే వారిని ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని విధివిధానాలు పాటిస్తున్నామని గ్రీన్‌నెస్ట్ సభ్యులు తెలిపారు.

సమాజ సేవ విషయంలో వారి దృక్పథాలను దగ్గరగా పరిశీలించాక మాత్రమే చేర్చుకోవడం జరుగుతుందని చెప్పారు. ఇటీవలే డిసెంబర్ 21న ఈ సంస్థ కొత్తగా వలంటీర్లను చేర్చుకోవడంపై ప్రత్యేక సమాలోచనను నిర్వహించింది. అప్పటికే వారి దగ్గర 1200 పైగా దరఖాస్తులు సిద్ధంగా ఉన్నాయి. విద్యార్థి దశలోనే ఇలాంటి కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనడం వల్ల నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని కోర్ గ్రూప్ సభ్యులు అభిప్రాయపడ్డారు.
 
డ్రైవర్ అవుతానన్నాడు!
మురికివాడలలోకి వెళ్లినప్పుడు అక్కడ పిల్లలతో మాట్లాడితే చాలా ఆశ్చర్యం కలుగుతుంటుంది. అలా ఒక పిల్లాడితో మాట్లాడుతూ పెద్దయ్యాక నువ్వు ఏమవుతావు? అని అడిగితే డ్రైవర్ అవుతానన్నాడు. ఎందుకలా అంటే, నాకు ఇంగ్లిష్ రాదు, అంతకు మించి ఏం కాగలను? అని ఆ పిల్లాడు ప్రశ్నించాడు! రెండేళ్లుగా అలాంటి పిల్లలకు ఇంగ్లిష్ బోధిస్తున్నాం. ఇప్పుడు వారి ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది.
 - రాఘవేంద్ర, గ్రీన్‌నెస్ట్ సభ్యుడు
 
చొరవలేక ఆగిపోతున్నారు!
మనలో చాలామందికి సామాజిక సేవ మీద ఆసక్తి ఉంది. అయితే వీధి చివర్లో ఉన్న చెత్తను తొలగించడానికి, అశుభ్రతతో ఉన్న పరిసరాలను పరిశుభ్రం చేయడానికి చొరవ చూపలేకపోతున్నామని మాతో కొంతమంది స్పష్టంగా చెప్పారు. ఎలాంటి బిడియం, సంశయం లేకుండా పరిసరాలను శుభ్రం చేస్తున్న మమ్మల్ని వారు అభినందిస్తున్నారు. మెల్లిగా మా వైపు వస్తున్నారు.
 - జయదీప్‌రెడ్డి, గ్రీన్‌నెస్ట్ అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement