విజయానికి క్లాప్ కొట్టారు..!
హిట్టైన సినిమాల, ట్రెండ్‌ను సృష్టించిన సినిమాపాత్రల, స్టార్ల పేరుతో బట్టలు అమ్మడం... చాలా పాత మార్కెటింగ్ టెక్నిక్. మరి టెక్నిక్ పాతది అయినా... మార్కెట్ సృష్టించుకోవడానికి ఇదొక ఊటలాంటిది. జనాల ఆసక్తుల, అభిరుచుల, ఇష్టాలతో ముడిపడిన ఈ పద్ధతిని అనుసరిస్తే వాళ్లకు దగ్గరకావొచ్చు, మార్కెట్‌ను చాలా సులభంగా విస్తృతపరుచుకోవచ్చు. ప్రస్తుతం ఈ విధంగా విజయపథాన దూసుకుపోతున్నారు ఇద్దరు యువకులు. హీరోలు, హీరోయిన్లు సినిమాల్లో ధరించిన డిజైనర్‌వేర్‌లను పోలిన డ్రస్సులను తయారు చేసి అమ్మడమే వీరి వ్యాపారం. ఆన్‌లైన్ ద్వారానే సాగుతున్న వీరి వ్యాపారానికి ఇప్పుడు మంచి స్పందన లభిస్తోంది. ఆసక్తికరమైన నేపథ్యంతో ఆసక్తికరమైన వ్యాపారం చేస్తున్న ఆ యువకులు చిన్మయ్ రాజుల, మామిడి రాజాలు. వారి గురించి, వారి ‘క్లాప్ వన్’ గురించి...
సమంత ధరించిన ఈ కుర్తీనే ఈ సరికొత్త వ్యాపారానికి పునాది వేసింది అన్నింటికంటే బాగా అమ్ముడయినవి ‘రేసుగుర్రం షర్ట్స్’ వీరికి వస్తున్న ఆర్డర్‌లలో అమ్మాయిలు చేస్తున్నవే ఎక్కువ ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాలో రాశిఖన్నా ధరించిన హెవీవర్క్ శారీలకు ఎనలేని డిమాండ్ ఉంది ఈగ సినిమాలో సమంత ధరించిన కుర్తీ డిజైన్ కూడా బాగా అమ్ముడయ్యింది.
బీటెక్ చ దివిన ఈ ఇద్దరూ అందరు గ్రాడ్యుయేట్లలా ఉద్యోగాన్వేషణలో పడలేదు. ఉద్యోగం చేయడం, ఎవరికో సమాధానంగా ఉండటం కంటే.. సొంతంగా ఏదైనా వ్యాపారాన్ని వృద్ధి చేసుకొని వెలుగులోకి రావాలని భావించారు. మరి వ్యవసాయ కుటుంబ నేపథ్యం... ఏదో వైవిధ్యం చూపితేనే వ్యాపారరంగంలో నిలదొక్కుకోగలిగేది. ఇలాంటి తరుణంలో చిన్మయ్, రాజాల మెదడులో మెదిలిన ఆలోచనే ‘క్లాప్‌వన్’.
‘ఈగ’ సినిమాలో హీరోయిన్ సమంత ధరించిన కుర్తీలాంటిదే తనకూ కావాలని అడిగిందట చిన్మయ్ చెల్లెలు. ఈగ హిట్ సినిమా కాబట్టి అలాంటి డిజైన్‌తోనే తయారు చేసిన కుర్తీ ఎక్కడో ఒక చోట దొరక్కపోదా అనుకొని దాన్ని కొనడానికి స్నేహితులిద్దరూ బయలేదేరారట. అయితే జంటనగరాల పరిధిలోని అన్ని ప్రముఖషాప్‌లలోనూ గాలించినా అలాంటి కుర్తీ లభించలేదట! చెల్లెలి కోసం అంతగా తిరిగినా లభించకపోవడం నిరాశ కలిగించింది. అయితే... మార్కెట్‌లో ఇలాంటి ఒక వ్యాక్యూమ్ ఉందని ఈ స్నేహితులకు అర్థం అయ్యింది. ఇంకేముంది అలాంటి శూన్యతను ఆధారంగా చేసుకొనే తమ వ్యాపారాన్ని మొదలు పెట్టాలని భావించారు. అలా అనుకొని ‘క్లాప్‌వన్’ ను మొదలు పెట్టారు.
‘క్లాప్’ అనేది సినిమా రంగానికి చెందిన పదం. ఇలా సినిమా స్టార్ల డిజైనర్ వేర్‌లను పోలిన డ్రస్సులను అమ్మే తొలిషాప్ మాదే.. అనే విషయాన్ని చెబుతూ దానికి ‘వన్’ను జత చేశామని వీరు చెప్పారు. ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్లు తీసుకోవడం కోరిన విధమైన డిజైనర్‌వేర్‌లను తయారు చేసి కొరియర్ సర్వీస్ ద్వారా డెలివరీ చేయడం. కొంత మూలధనాన్ని పెట్టి చిన్మయ్, రాజాలు ఈ వ్యాపారం మొదలు పెట్టారు.
ఇంజనీరింగ్ నేపథ్యం ఉంది కాబట్టి.. స్నేహితుల ద్వారా కావాల్సినంత ప్రచారం వచ్చింది. వీళ్ల కాన్సెప్ట్‌ను విని డ్రస్సింగ్ విషయంలో సినిమా వాళ్లను అనుకరించే ఆసక్తి ఉన్న అనేక మంది యువతీయువకులు కోరి మరీ డ్రస్సులను డిజైన్‌చేయించుకొన్నారు. అలా ఒకరి నుంచి ఒకరికి సాగిన ప్రచారంతో క్లాప్‌వన్‌కు మంచి గుర్తింపు దక్కింది.
ఫేస్‌బుక్, ఆన్‌లైన్ ప్రచారం ఉండనే ఉంది. దీంతో కొన్ని నెలల్లోనే క్లాప్‌వన్‌కు మంచి గుర్తింపు వచ్చింది. దాదాపు మూడువేల మంది కస్టమర్లు తయారయ్యారు! యువతలో సినిమా వాళ్ల డ్రస్సులపై ఉన్న ఆసక్తే వీరి వ్యాపారానికి మూలాధారం.‘‘మేము డిజైన్‌చేసే దుస్తులను ‘ఇన్‌స్పైర్డ్ కలెక్షన్స్’అని చెప్పవచ్చు. సినిమాల్లో హీరో హీరోయిన్లు ధరించిన దుస్తుల మోడల్‌ను మేము సంపాదించి వాటి తరహాలోవి తయారు చేస్తాం. దీనికోసం సినిమా వాళ్లను కలుస్తాం. వారితో ఒప్పందాన్ని కుదుర్చుకొని దుస్తులను డిజైన్ చేస్తాం.
డిజైనింగ్ కోసం మా దగ్గర నిపుణులున్నారు. యువతలో బాగా ఆసక్తి రేకెత్తించిందన్న సినిమా డిజైనర్‌వేర్‌లనే మేము తయారు చేస్తాం. మా దగ్గర ఉన్న కలెక్షన్ల వివరాలు అన్నీ క్లాప్‌వన్ వెబ్‌సైట్‌లో ఉంటాయి. వాటిని చూసి ఆర్డర్ చేస్తే.. వారం రోజుల్లోగా డెలివరీ చేస్తాం..’’అంటూ తమ వ్యాపార వివరాలను చెబుతారు చిన్మయ్. ధరల విషయానికి వస్తే సినిమాలో స్టార్లు ధరించే దుస్తుల విలువ పదివేలపైమాటేనట. అయితే వాటికి నకలుగా వీరి దగ్గర లభించే దుస్తులు వాటి స్థాయిని బట్టి 499 రూపాయల నుంచి తొమ్మిదివేల రూపాయల వరకూ అందుబాటులో ఉంటాయి.
సొంతంగా ఒక బ్రాండ్‌ను సృష్టించుకోవడమే తమ లక్ష్యమని అంటారు ఈ స్నేహితులు. ఇప్పుడు అనేక మంది పెట్టుబడిదారులు తమతో చేతులు కలపడానికి వస్తున్నారని... ఆ శక్తిని కలగలుపుకొని మరింత వ్యాపారాభ్యున్నతిని సాధిస్తామని వీరు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలపై ఆసక్తి అనేది యువతలో ఎన్నటికీ కొనసాగుతూ ఉండే దే. సినిమా వాళ్లను ఆనుకరించేం దుకు ఆసక్తి చూపే వారు ప్రతి తరంలోనూ ఉంటారు. కాబట్టి ‘క్లాప్‌వన్’ వ్యాపారానికి ఎప్పటికీ మార్కెట్ ఉంటుంది. తద్వారా ఈ యువకులిద్దరూ తమకంటూ సొంత బ్రాండ్‌నొకదానిని నెలకొల్పాలన్న తమ లక్ష్యాన్ని సాధించే దిశలోనే పయనిస్తున్నారు.
- బీదాల జీవన్‌రెడ్డి