మూగబోనున్న ‘బిగ్‌బెన్’
లండన్: ప్రపంచప్రఖ్యాత బిగ్ బెన్ గడియారం మరో వారం రోజుల్లో మూగబోనుంది. మరమ్మతుల కోసం ఈ గడియారాన్ని తాత్కాలికంగా ఆపేయనున్నారు. వచ్చే సోమవారం నుంచి బిగ్ బెన్ టిక్‌టిక్ ఆగనుంది. 157 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ గడియారం సాంకేతిక లోపంతో 2007లో నిలిచిపోయింది. అంతకుముందు 1983-1985 కాలంలో స్వల్ప మరమ్మత్తుల కోసం దీన్ని ఆపారు.
సెంట్రల్ లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ పార్లమెంట్ కాంప్లెక్స్‌లోని ఎలిజబెత్ టవర్‌పై ఈ గడియారం ఉంది. దాదాపు 13.7టన్నుల బరువైన బిగ్ బెన్ మరమ్మత్తుల అనంతరం 2021 నుంచి పని చేయటం ప్రారంభిస్తుంది. దీనికి అవసరమైన పరికరాలను మార్చటంతో పాటు టవర్‌కు లిఫ్ట్, గడియారానికి పక్కన టాయిలెట్, కిచెన్‌ను ఏర్పాటు చేయనున్నారు. అయితే, కొత్త సంవత్సరం తదితర ముఖ్యమైన సందర్భాల్లో మాత్రం బిగ్‌బెన్ గంటలు మోగిస్తుందని అధికారులు తెలిపారు.
లండన్ మొత్తమ్మీద ఎలిజబెత్ టవర్ వద్దనే అత్యధిక సంఖ్యలో జనం ఫొటోలు తీసుకుంటుంటారు. 1859లో ఇయాన్ వెస్ట్వర్త్ అనే నిపుణుడు ఈ గడియారాన్ని రూపొందించారు. నాలుగు ముఖాలు కలిగిన, అత్యంత కచ్చితమైన సమయం చూపించే ప్రపంచంలోనే అతి పెద్ద గడియారం ఇదే.