డీజిల్ కార్లపై నిషేధం ఎత్తివేత?
న్యూఢిల్లీ: సుప్రీం తాజా వ్యాఖ్యలు కార్ల తయారీ సంస్థలకు పెద్ద ఊరటనివ్వబోతున్నాయా? దేశ రాజధాని ప్రాంతంలో 2000సీసీ కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న డీజిల్ ఎస్యూవీల పై నిషేధాన్ని ఎత్తివేసే అవకాశం ఉందని సుప్రీంకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. దీంతో డీజిల్ వాహనాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. గ్రీన్ సెస్ చెల్లించే పక్షంలో డీజిల్ వాహనాల అమ్మకాలపై నిషేధాన్ని ఎత్తివేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు పేర్కొంది. కాలుష్య కారకాలను వెదజల్లే వాహనాలకు సంబంధించిన పలు పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్, న్యాయమూర్తి ఎకె సిక్రీ, న్యాయమూర్తి ఆర్ భానుమతితో కూడిన విచారించిన సుప్రీం ధర్మాసనం ఈ మేరకు నివేదికలు తయారు చేయాలని కోరింది.
అయితే కార్ల దిగ్గజాలు మెర్సిడెస్ , టొయాటో సంస్థ న్యాయవాదులు తమ కార్ల ఎక్స్ షో రూం ధరలపై ఒకశాతం పన్నును ఇపుడే డిపాజిట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే కార్ల ఉత్పత్తి సంస్థలు కలసి కూర్చొని చర్చించుకుని ఉమ్మడి ప్రతిపాదనతో రావాలని న్యాయమూర్తి ఠాకూర్ ఆదేశించారు.
భారతదేశం లో వాహనం తయారీదారులకు సంబంధించి ఎమిషన్ స్టాండర్డ్స్ ఏంటి? దీన్ని ఎవరు నియంత్రిస్తారు? యూరోప్ లో ఉద్గార పరీక్షలు విఫలమైనపుడు, భారతదేశంలో విఫలంకావని హామీ ఏదైనా ఉందా ? లాంటి అంశాలపై బెంచ్ ప్రశ్నించింది. ఈ గ్రీన్ సెస్ చెల్లింపులపై రోడ్ మ్యాప్ తయారు చేయాలని కార్ల తయారీదారులను కోరింది. అలాగే భారతదేశంలో ఈ కార్ల అమ్మకాలను అనుమతించడానికి ముందు ఎమిషన్ పరీక్షల గురించి తెలిపాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం కోరింది. కార్ల అమ్మకానికి అనుమతించే వివిధ నిబంధనలు, కార్లు నమూనాలను పరీక్షించేందుకు ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధికార ఏజెన్సీ అని ఎమికస్ క్యూరీ అపరాజిత కోర్టుకు తెలిపారు. అనంతరం తదుపరి విచారణను కోర్టు జులై 4కి వాయిదావేసింది.
కాగా వాహనాల వాయు కాలుష్యంపై విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం అక్షింతలు వేయటంతోపాటు ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. డీజిల్ కార్లపై గ్రీన్ ట్యాక్స్ విధింపుపై ఆటోమొబైల్ కంపెనీలు, కేంద్రం వాదనలను తిరస్కరించింది. కాలుష్య కారకాలను వెదజల్లే వాహనాలకు సంబంధించిన పలు పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్, న్యాయమూర్తి ఎకె సిక్రీ, న్యాయమూర్తి ఆర్ భానుమతితో కూడిన సుప్రీం ధర్మాసనం 2000 సీసీ సామర్థ్యాన్ని మించిన డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్లపై ఉన్న నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.