తెలుగోడి చెవిలో పువ్వు
విజయనగరం మున్సిపాలిటీ :
అధికారంలోకి రాక ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తరువాత మరోమాట మార్చుతూ బీజేపీ సర్కారు తెలుగు వారిని మోసం చేస్తోందని విశాలాంధ్ర మహాసభ జిల్లా అధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడిగా ఉన్న ఆంధ్రరాష్ట్రాన్ని విభ జించిన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని హమీలు ఇచ్చి నేడు ఆ హామీలను తుంగలో తొక్కుతున్న కేంద్ర ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ వినూత్న తరహాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్లో విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో ప్రధాన మంతి నరేంద్రమోడీ, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మాస్కులు ధరించి ఆ మార్గంలో వచ్చి పోయే వారందరికీ చెవిలో పువ్వులు పెడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందుకు ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేస్తామని చెప్పిన నాయకులే నేడు ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చిచెప్పడం తెలుగువారి చెవులో పువ్వులు పెట్టడమేనన్నారు.
విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో వెనుకబడిందని, ప్రత్యేక హోదాయే రాష్ట్ర భవిష్యత్‌కు శరణ్యమని అన్నారు. రాష్టానికి ప్రత్యేక హోదా కల్పించడంతోనే తెలుగువారి భవిష్యత్ ముడిపడి ఉందని ఇప్పటికైనా మోసపూరిత విధానాలను విడనాడి ప్రత్యేక హోదా కల్పిస్తూ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో విశాలాంధ్ర మహాసభ జిల్లా అధ్యక్షుడు మద్దిల సోంబాబు, సభ్యులు రాంబాబు, పైడినాయుడు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.