విశ్వం పుట్టుకకు ‘బిగ్ బౌన్స్’ కారణమా?
లండన్: మన విశ్వం పుట్టుకకు బిగ్‌బౌన్స్’ సిద్ధాంతమే కారణమయ్యి ఉండొచ్చని శాస్త్రవేత్తలంటున్నారు. దీన్ని సమర్థించేలా లండన్, కెనడా పరిశోధకులు ఒక అధ్యయనం చేశారు. 13 బిలియన్ సంవత్సరాల క్రితం సంభవించిన పేలుడు వల్ల విశ్వం ఏర్పడిందనేది బిగ్‌బ్యాంగ్ సిద్ధాంతం. ప్రస్తుతం దీన్నే నమ్ముతున్నాం. అలా కాకుండా పూర్వం ఉన్న విశ్వం పాతరూపం పతనమై ఒక్కసారిగా కొత్తరూపంలో ప్రస్తుత విశ్వం ఆవిర్భవించిందనేది బిగ్‌బౌన్స్ సిద్ధాంతం.
విశ్వం ఎప్పుడూ సంకోచ, వ్యాకోచాలు చెందుతూ ఉంటుందనీ, అలా వ్యాకోచించినపుడు ఏర్పడినదే ప్రస్తుత మన విశ్వమని మరికొందరి వాదన. బిగ్‌బౌన్స్ సిద్ధాంతం 1922 నుంచి చర్చల్లో ఉన్నప్పటికీ, విశ్వం ఎలా ఏర్పడిందో అది కచ్చితంగా వివరించలేక పోవడం వల్ల దీన్ని పట్టించుకోలేదు. లండన్ ఇంపీరియల్ కళాశాల, కెనడాలోని ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఫర్ థియారిటికల్ ఫిజిక్స్’ కు చెందిన ఇద్దరు భౌతిక శాస్త్రవేత్తలు తాజాగా బిగ్‌బౌన్స్ సిద్ధాంతం నిజమయ్యి ఉండొచ్చనేలా తమ పరిశోధనలతో నిరూపిస్తున్నారు. విశ్వం ఎలా ఏర్పడిందో సూచించేలా వారు ఒక గణితశాస్త్ర నమూనాను రూపొందించారు.