ఆ విషయంలో గొడవలు వస్తుంటాయి: ఎన్టీఆర్
‘బిగ్‌బాస్ షోను నాని బాగా రక్తి కట్టిస్తున్నాడు. ప్రతివారం పిట్ట కథలతో ఆకట్టుకుంటున్నాడు. ముందు చెప్పినట్లుగానే ఈసారి మరికాస్త మసాలా యాడ్ చేస్తూ తనదైన శైలిలో అదరగొడుతున్నాడం’టూ నానిపై ప్రశంసలు కురిపించారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అంతేకాక బిగ్‌బాస్ లాంటి భారీ ప్రాజెక్ట్‌కు ఎవరూ చేసినా బాగానే ఉంటుందన్నారు. మొబైల్ రిటైల్ ఇండస్ట్రీలోకి కొత్తగా ప్రవేశించిన ‘సెలెక్ట్’ తన బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్టీఆర్‌ను నియమించుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఎన్టీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మొబైల్ స్టోర్స్ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. అందుకే వీటిలో భాగం అయ్యాను. నా మొదటి ఫోన్ జగదీష్ మార్కెట్లో కొన్నాను. ఇప్పటికి ఫోన్లో గేమ్‌లే ఎక్కువగా ఆడుతుంటాను. మొదట్లో ఐ ఫోన్ ఎలా వాడాలో అర్థం అయ్యేది కాదు. కానీ మా అబ్బాయి అభయ్‌రామ్ ఇప్పడే నా ఐఫోన్‌నే కాక వాడి నానమ్మ ఐఫోన్ కూడా వాడుతున్నాడు. అయితే అభయ్కు ఫోన్‌ను మాత్రం గిఫ్ట్‌గా ఇవ్వను. నాకు, నా భార్యకు ఫోటోలు దిగే దగ్గరే ఎక్కువగా గొడవలు వస్తుంటాయి’ అని తెలిపారు. గతంలో నవరత్న, మలబార్ గోల్డ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా చేసిన తారక్ మొబైల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా చేయడం మాత్రం ఇదే ప్రథమం.