చిరుదీపాలు వెలిగిస్తున్నాడు
స్ఫూర్తి
సాటివారికి సాయం చేయాలంటే వారికి డబ్బు, నగలు, వస్త్రాలు వంటివి ఇవ్వనక్కరలేదని, అసలు సాయం చేయాలన్న మంచి మనసు ఉంటే చాలని నిరూపించాడో సెక్యూరిటీ గార్డు. డెహ్రాడూన్‌లోని మాజ్రాలో అలహాబాద్ బ్యాంక్ ఏటీఎంకు సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న బిజేందర్ తాను విధులు నిర్వహిస్తున్న ఏటీఎం ముందున్న ఖాళీస్థలంలో చుట్టుపక్కల వీధిబాలలు, యాచకులు, మురికివాడలలోని పిల్లలను పోగు చేసి, ఆ ఏటీఎం లైటు వెలుగులోనే వారికి నాలుగక్షరమ్ముక్కలు నేర్పుతున్నాడు.
సాయంత్రం కాగానే అనాథలు, వీధిబాలలు, యాచకులు బిజేందర్ సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్న ఏటీఎం వద్దకొచ్చి చేరతారు. పొట్టకోస్తే అక్షరం ముక్కరాని ఆ అభాగ్యులకు అక్షరాలు నేర్పుతూ, నిరక్షరాస్యతా చీకటిని పారద్రోలుతూ, వారిలో విద్యావెలుగులను నింపే ప్రయత్నం చేస్తున్నాడు విజేందర్.
చదువులేనివారికి అక్షరజ్ఞానం కల్పించడానికి ఎమ్మేలు, బీయేలు చదివి ఉండాల్సిన అవసరం లేదు. కనీస విద్య, ఏదోవిధంగా అవతలివారికి సాయం చేయాలన్న తపన ఉంటే చాలని నిరూపిస్తున్న విజేందర్, ఏటీఎం ముందు విద్యాదీపాలు పెట్టడం మొదలెట్టి ఇప్పటికే పదహారేళ్లయింది. ఇన్నేళ్లుగా తాను చేస్తున్న ఉద్యోగం కన్నా, ఆ ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం కన్నా కూడా తనకు ఎంతో సంతృప్తి కలిగిస్తున్నది ఇదేనని దీపాల్లా మెరుస్తున్న కళ్లతో ఎంతో సంతోషంగా చెబుతున్నాడు.