విద్యుత్ షాక్ తో విద్యార్థి మృతి
బిజినేపల్లి: పాఠశాలకు సున్నం వేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ తగిలి కొప్పరి మహబూబ్ (14) అనే బాలుడు మృతిచెందాడు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా బిజినే పల్లి మండలం పాలెం గ్రామంలోని శాంతినికేతన్ పాఠశాలలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. పాలెం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మహబూబ్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఏడో తరగతి వరకు శాంతినికేతన్ పాఠశాలలో చదివాడు.
ఆదివారం సెలవు కావడంతో డబ్బులొస్తాయని తన స్నేహితులు రాంబాబు, సురేష్‌లతో కలిసి శాంతినికేతన్ స్కూల్‌కు సున్నం వేసే పనికి వెళ్లారు. సున్నం వేస్తుండగా స్కూల్ భవనం పైన ఉన్న ఇనుప రాడ్‌ను ముట్టుకొనే సరికి కరెంటు షాక్ తగిలింది. కరెంటు షాక్ తగిలిన మహబూబ్ అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. పోలీసులు స్కూల్ కరెస్పాండెంట్ నాగరాజు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుణ్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.