biju
-
బైజూస్‌తో ఒప్పందం పేద విద్యార్థులకు మేలు
నెల్లిమర్ల రూరల్: రాష్ట్ర ప్రభుత్వం బైజూస్‌తో చేసుకున్న ఒప్పందంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్ధులకు ఎంతో మేలు చేకూరుతుందని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. మండలంలో సతివాడ ఆదర్శ పాఠశాలలో గురువారం అమ్మఒడి వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడ్డుకొండ మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేసేందుకు సీఎం జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ఆర్థిక పరిస్థితి బాగున్న పిల్లలు మాత్రమే బైజూస్ విధానంలో చదవగలరని.. తాజా ప్రభుత్వ ఒప్పందంతో ప్రభుత్వ విద్యార్థులు ఉచితంగానే విద్యనభ్యసిస్తారన్నారు. 4 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు బైజూస్ కంటెంట్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు మాట్లాడుతూ, నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయన్నారు. అనంతరం రూ.10.76 కోట్ల నమూనా చెక్కును తల్లిదండ్రులకు అందజేశారు. పది, ఇంటర్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయుడు, డీసీసీబీ వైస్ చైర్మెన్ చనమళ్లు వెంకటరమణ, వైస్ ఎంపీపీ పతివాడ సత్యనారాయణ, కార్పొరేషన్ డైరెక్టర్లు రేగాన శ్రీనివాసరావు, జానా ప్రసాద్, నౌపాడ శ్రీనివాసరావు, సర్పంచ్ రేవళ్ల శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యుడు రెడ్డి సత్యనారాయణ, నాయకులు జమ్ము అప్పలనాయుడు, లెంక గోవిందరావు, తహసీల్దార్ రమణరాజు, ఎంఈఓ కృష్ణారావు, ప్రిన్సిపాల్ పద్మలత పాల్గొన్నారు. (చదవండి: ఔను... ఆయనకు ఉద్యోగం వచ్చింది) -
హృదయం: ఏ ప్రేమా ఇలా మొదలై ఉండదు!
అబ్బాయికి అమ్మాయిని చూడగానే ప్రేమ పుడుతుందంటారు. కానీ అమ్మాయికి అలా పుట్టడం అరుదు. ఒకవేళ పుట్టినా ఆమె బయటపడదు. అతని కళ్లతో ఆమె కళ్లు కలవాలంటే... అతని అడుగులతో ఆమె అడుగులు సాగాలంటే... అతని జీవితమే ఆమె జీవితం కావాలంటే... అతనిపై నమ్మకం కుదరాలి. అతనిలో ఆమెకు ఏదో ప్రత్యేకత కనిపించాలి. కేరళకు చెందిన బిజు నారాయణన్... ఒక గ్రీటింగ్ కార్డుతో శ్రీలతలో ఆ నమ్మకం కలిగించాడు. తన ప్రత్యేకత ఏంటో చూపించాడు. ఇంతకీ ఏం రాసుందా గ్రీటింగ్ కార్డులో? అన్నీ ప్రింటెడ్ అక్షరాలు, ప్రింటెడ్ మాటలే... కానీ కింద మాత్రం ‘టు మై వైఫ్... యువర్స్ బిజు’ అని ఉంది! కోచిలోని మహరాజా కళాశాలలో విద్యార్థులు బిజు, శ్రీలత. డిగ్రీకి ముందు నుంచే ఇద్దరికీ పరిచయం. బిజు గాయకుడు. అప్పటికే కాలేజీలో పాటలు పాడి ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అతను శ్రీలతను చూడగానే ప్రేమలో పడిపోయాడు. కొన్ని రోజుల తర్వాత, ఆమెకు గ్రీటింగ్ కార్డుఇచ్చాడు. అందులో ‘టు మై వైఫ్’ అని చూశాక, లతకు నోట మాట రాలేదు. తనలో కలిగిన సంభ్రమాశ్చర్యాల్ని బయటపెట్టలేదు. ఏం మాట్లాడకుండా వెళ్లిపోయింది. లోలోన మాత్రం వీడేంట్రా బాబూ... నన్నప్పుడే భార్య అంటున్నాడు అనుకుంది. ఆ ఒక్క మాటతో ఆమెకు భవిష్యత్తు చూపించాడు బిజు. తనకు తెలీకుండానే బిజు ప్రేమలో పడిపోయింది శ్రీలత. మనసులోనే అతని ప్రేమకు అంగీకారం తెలిపింది. కానీ పైకి ‘ఓకే’ చెప్పడానికి ఆమెకు ఇంకో లిట్మస్ టెస్ట్ అవసరమైంది. ఒకరోజు తన ఫ్రెండ్ ఆషాకు తన ప్లాన్ చెప్పి పంపించింది. సైన్స్ గ్రూపులో అందమైన, సింగర్ కూడా అయిన ఓ అమ్మాయి గురించి అతని దగ్గర ప్రస్తావించింది ఆషా. ‘‘ఆ అమ్మాయి నీకు మంచి మ్యాచ్ అనుకుంటా’’ అందామె. దీనికి బిజు సమాధానం... ‘‘నాకు అమ్మాయిలతో రొమాన్స్ చేసే ఉద్దేశం లేదు. నేను పెళ్లి చేసుకునే అమ్మాయిని ఇప్పటికే ఫిక్స్ చేసుకున్నా’’ అన్నాడు. ఈ విషయం తెలిశాక, శ్రీలత తన జీవితం బిజుతోనే అని ఫిక్సయిపోయింది. డిగ్రీ ఫైనల్ ఇయర్లో మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు బిజు. శ్రీలత సరే అంది కానీ, ‘‘మనం ఎలా బతుకుతాం. ఇల్లెలా గడుస్తుంది’’ అని అడిగింది. అప్పటికి ఇద్దరి వయసు 20 ఏళ్లు. తర్వాత శ్రీలత తిరువనంతపురంలో లా కోర్సులో చేరింది. బిజు సింగర్‌గా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఆమె లా పూర్తయింది. అతను ఓ మెట్టు ఎదిగాడు. కానీ ఇద్దరి మధ్యా దూరం. దగ్గరగా ఉండాలని ఇద్దరూ మహారాజా కళాశాలలోనే ఎంఏ చేరారు. ఈ కోర్సూ పూర్తయింది. మరోవైపు బిజూ సంగీత కచేరీలు చేసే స్థాయికి ఎదిగాడు. సరిగ్గా తమ తొలి పరిచయమైన పదేళ్లకు 1998లో బిజు, శ్రీలత పెళ్లి చేసుకున్నారు. ప్రేమ పదేళ్ల తర్వాత పెళ్లిగా మారడమంటే సుదీర్ఘమైన విషయమే కదా! ఇప్పుడు బిజు, శ్రీలతలకు ఇద్దరు పిల్లలు. 13 ఏళ్ల సిద్ధార్ధ్, 8 ఏళ్ల సూర్యనారాయణ్. బిజు తరచు మ్యూజిక్ కన్సర్ట్ల కోసం బయట తిరుగుతుంటాడు. శ్రీలత పిల్లల్ని, కుటుంబ బాధ్యతల్ని చూసుకుంటోంది. కులాలు వేరని, తాహతులు వేరని ఒకప్పుడు అభ్యంతరం చెప్పిన పెద్దలు, ఇప్పుడు వారితో కలిసిపోయారు. వారి అనుబంధాన్ని చూసి మురిసిపోతున్నారు. ‘‘బిజులా ప్రేమించే వ్యక్తి ఎవరూ ఉండరు. ఐతే అతని ప్రేమ మాటల్లో ఉండదు. చేతల్లో మాత్రమే చూపిస్తాడు. అతను తరచు వేరే ప్రాంతాలకు వెళ్తుంటాడు. ఎప్పుడొస్తాడా అని మేమంతా ఎదురుచూస్తుంటాం. ప్రతిసారీ బోలెడన్ని బహుమతులతో ఇంటికొస్తాడు. ఐతే తనిచ్చిన తొలి బహుమతే (గ్రీటింగ్ కార్డు) చాలా ప్రత్యేకమైంది. తనపై నేనా రోజు ఏ నమ్మకమైతే పెట్టుకున్నానో... అది నిజమని నిరూపించాడు’’ అంటూ ఉద్వేగంగా చెప్తారు శ్రీలత. మరో ప్రేమ కథ 2011 మే 22. అమెరికాలోని జాప్లిన్. టోర్నెడో గురించి టీవీల్లో హెచ్చరికలు జారీ అవుతున్నాయి. అప్పుడే ఇంటికి వచ్చాడు 31 ఏళ్ల డాన్. భార్య బెథానీ అప్పటికే వణికిపోతోంది. అసలే తమ ఇంటికి బేస్మెంట్ కూడా లేదు. టోర్నెడో తాకిందంటే, ఇల్లు నామరూపాల్లేకుండా పోతుంది. ఏదో ఒకటి చేయాలి అనుకుంటుండగానే, టోర్నెడో బీభత్సం మొదలైపోయింది. ఇంట్లోకి నీళ్లొచ్చేశాయి. ఇల్లు కూలిపోవడం మొదలైంది. డాన్ చకచకా పిల్లోస్ తీసుకున్నాడు. బెథానీని తీసుకుని బాత్రూమ్లోకి పరుగెత్తాడు. ఆమెను బాత్ టబ్‌లో పడుకోమన్నాడు. తనమీద పిల్లోస్ పెట్టాడు. మీద రక్షణగా తాను పడుకుని టబ్‌ను గట్టిగా పట్టుకున్నాడు. టోర్నెడో శాంతించాక - ఇల్లు లేదు... డాన్ లేడు. మిగిలింది బెథానీ మాత్రమే. భార్య ప్రాణం కాపాడటం కోసం తన ప్రాణం వదిలేశాడు డాన్.