శిల్పా చౌదరికి రూ.11కోట్లు ఇచ్చిన ఆ బాధితురాలెవరు..?
సాక్షి, హైదరాబాద్: తన పేరు మీద గండిపేటలోని సిగ్నేచర్ విల్లాస్‌లో విల్లా నంబర్–17 మాత్రమే ఉందని కిట్టీ పార్టీలతో సంపన్న వర్గాల మహిళల నుంచి రూ. కోట్లు వసూలు చేసిన తెల్ల శిల్పా చౌదరి పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. పెట్టుబడులు, అధిక వడ్డీల రూపంలో పలువురు బాధితుల నుంచి వసూలు చేసిన సొమ్మును మరో మహిళకు ఇచ్చానని, ఆమె మోసం చేయడంతోనే ఈ ఇబ్బందులు మొదలయ్యాయని తెలిపినట్లు పోలీసు వర్గాలు చెప్పాయి. నగదు తీసుకున్న మహిళ కూడా ఈవెంట్ మేనేజ్మెంట్లతో పాటు స్థిరాస్తి వ్యాపారంలో ఉన్నారని చెప్పినట్టు సమాచారం.
చదవండి: (భర్త లింగమార్పిడి.. మరొకరితో సహజీవనం.. అంతలోనే..)
శిల్ప, ఆమె భర్త కృష్ణ శ్రీనివాస్ ప్రసాద్‌ల స్థిర, చరాస్తులపై విచారణాధికారులు, నార్సింగి స్పెషల్ ఆపరేషన్స్ టీం (ఎస్ఓటీ) పోలీసులు రెండ్రోజులు ఆరా తీసినట్టు తెలిసింది. వందల సంఖ్యలో బాధితుల నుంచి వసూలు చేసిన కోట్లాది రూపాయలతో బినామీ పేర్లతో స్థలాలు కొని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎక్కడెక్కడ కొన్నారు.. ఆస్తులు ఎవరి పేర్ల మీదు ఉన్నాయో తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. శిల్ప కస్టడీ శనివారం మధ్యాహ్నంతో ముగియడంతో ఆమెను తిరిగి చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు.
రూ.11 కోట్లు ఇచ్చిందెవరు?
దివానోస్ పేరిట క్లబ్ ఏర్పాటు చేసిన శిల్ప.. హై ప్రొఫైల్ సెలబ్రిటీలతో నెలలో రెండు సార్లు కిట్టీ పార్టీలు నిర్వహించేది. తనకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందని, పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాలు ఇస్తానని ఆశ చూపి ఒక్కొక్కరి నుంచి రూ. కోటి నుంచి రూ. 5 కోట్ల వరకు వసూలు చేసింది. అయితే ఒక్క బాధితురాలు మాత్రం రూ.11 కోట్లు ఇచ్చినట్టు ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. ఆమె ఇప్పటివరకు ఫిర్యాదు చేయలేదన్నారు.
చదవండి: (భార్యను భరించలేను.. విడాకులు కావాల్సిందే: సాఫ్ట్వేర్ ఇంజనీర్)
బాధితులు వేలల్లో.. ఫిర్యాదులు మూడే!
శిల్పా చౌదరి కాల్ డేటా ఆధారంగా ఆమె బాధితుల సంఖ్య వేలల్లోనే ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ముగ్గురు మహిళా బాధితులే నార్సింగి పీఎస్‌లో ఫిర్యాదు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పుప్పాలగూడలోని మహిళ వ్యాపారవేత్త దివ్యారెడ్డి (రూ.1.05 కోట్లు) ఫిర్యాదుతో శిల్ప బాగోతం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత సూపర్‌స్టార్ కృష్ణ కూతురు ప్రియదర్శిణి (రూ.2.9 కోట్లు) ఫిర్యాదు చేసింది. మూడో బాధితురాలు నార్సింగికి చెందిన వ్యాపారవేత్త రోహిణి (రూ.3.1 కోట్లు) కేసు నమోదు చేసింది. వీళ్ల ముగ్గురు శిల్పకు ఇచ్చిన సొమ్ము రూ.7.05 కోట్లు.
శిల్ప చెప్పేదంతా అవాస్తవం
తాను వసూలు చేసిన మొత్తంలో రూ.6 కోట్లు జన్వాడకు చెందిన టంగుటూరి రాధికా రెడ్డికి ఇచ్చానని పోలీసులకు శిల్ప చెప్పినట్టు తెలిసింది. ఆమెను పోలీసులు విచారిచంగా శిల్ప చెప్పేదంతా అవాస్తవమని, ఆమెనే తన దగ్గర డబ్బులు తీసుకుందని రాధిక ఆరోపించింది. శిల్ప ఇచ్చిన చెక్కులు, ఇతర పత్రాలను పోలీసులకు సమర్పించినట్లు సమాచారం.