ప్రాణం పోసేది పాతపంటలే!
నిలువునా రైతుల ప్రాణాలు తీసే పంటలు మాకొద్దు.. మెట్ట పాంతాల్లోని చిన్న, సన్నకారు రైతుల ప్రాణాలు నిలిపేవి సంప్రదాయ పాత పంటలేనని మెదక్ జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి చెందిన చిన్న, సన్నకారు మహిళా రైతులు ఎలుగెత్తి చాటారు. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో 16వ పాత పంటల(అంటే.. అనాదిగా స్థానికంగా పండిస్తున్న చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటల సాగు) పండుగ జాతర ముగింపు ఉత్సవం జహీరాబాద్ సమీపంలోని మాచునూర్లో ఇటీవల కన్నుల పండువగా జరిగింది. సంక్రాంతి రోజు నుంచి నెల రోజుల పాటు పాత పంటల ప్రాధాన్యాన్ని గ్రామాల్లో ప్రచారం చేస్తూ బయోడైవర్సిటీ ఫెస్టివల్ సాగింది.
ఈ ఏడాది ముగింపు ఉత్సవంలో వినూత్నంగా నిర్వహించిన ‘ప్రాణం తీసే పంటల’ దిష్టిబొమ్మ దహనం, ‘ప్రాణం పోసే పంటల’కు ఊయల సేవ అతిథులను ఎంతగానో ఆకట్టుకుంది. వర్షాధారంగా పాతకాలం నుంచి మెట్ట రైతులు సొంత విత్తనాలతో పండిస్తున్న జొన్న, సజ్జ, కొర్ర వంటి చిరుధాన్యాలు, కందులు, మినుములు, పెసలు, అలసందలు, కుసుమ వంటి జీవ వైవిధ్య పంటలే అన్నదాతల ప్రాణాలను కాపాడుతాయని మహిళా రైతులు చెప్పారు. అధిక పెట్టుబడి, అధిక నీరు అవసరమయ్యే పత్తి, సోయాబీన్, చెరకు, మొక్కజొన్న వంటి వాణిజ్య పంటలు రైతుల ‘ప్రాణాలు తీసే’ పంటలను నిరసిస్తూ పత్తి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం విశేషం. కరువును తట్టుకొని బడుగు రైతుల చింత తీర్చే చిరుధాన్యాల రాష్ట్రంగా తెలంగాణను ప్రకటించాలని డీడీఎస్ మహిళా రైతు సంఘాలు ఇటీవల ప్రభుత్వానికి సూచించాయి.