biometric for scholarship
-
‘ఫీజు’పై ‘భయో’మెట్రిక్
నర్సీపట్నం, న్యూస్‌లైన్ : ఒక వైపు ఆధార్... మరో వైపు బయోమెట్రిక్... ఇలా ఏటా కొత్త నిబంధనలు అమల్లోకి తెస్తున్న ప్రభుత్వం పరోక్షంగా పథకంలో కోతలకు ప్రోత్సహిస్తోంది. నిధులు మంజూరులో నిర్లక్ష్యం చేస్తూ క్షేత్రస్థాయి పరిస్థితిని పట్టించుకోకుండా కొత్త విధానాలకు శ్రీకారం చుడుతోంది. ఈ విద్యా సంవత్సరం ముగియడానికి మరో మూడు నెలలే ఉంది. ఇంత తక్కువ సమయంలో పాత నిబంధనలతోనే జిల్లాలోని సుమారు లక్షా 30 వేల మంది విద్యార్థుల దరఖాస్తు ప్రక్రియ పూర్తి కావడం కష్టమవుతుంది. ఈ పరిస్థితుల్లో నిధులు పక్కదారి పడుతున్నాయనే సాకుతో కొత్తగా బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తెచ్చి, మూడు నెలల్లో నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. స్వల్ప వ్యవధిలో ఎలా పూర్తవుతుందంటూ కళాశాలల యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి. గతంలా కాకుండా అధికారుల స్థానంలో యాజమాన్యాలే విద్యార్థుల దరఖాస్తులపై విచారణ చేసేలా బయో మెట్రిక్ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ విధానంలో విద్యార్థి ఆన్లైన్ చేసిన దరఖాస్తును బయోమెట్రిక్ యంత్రం ద్వారా కళాశాల ప్రతినిధి పరిశీలన చేయాల్సి ఉంది. ఇది పూర్తయ్యాక విద్యార్థి వేలిముద్ర ద్వారా ఆధార్ సర్వర్‌తో అనుసంధానమవుతుంది. అనంతరం జిల్లా అధికారులకు చేరిన దరఖాస్తును బార్ కోడ్ విధానంతో చూసి, ట్రెజరీల ద్వారా విద్యార్థికి ఫీజులు మంజూరు చేస్తారు. అయితే ఈ విధానం అమలుకు రూ. 30 వేల విలువ చేసే బయోమెట్రిక్ యంత్రాలను కళాశాలల యాజమాన్యాలే కొనుగోలు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటివరకు జిల్లాలో ఉన్న 527 కళాశాలల్లో ఈ యంత్రాలను కొనుగోలు చేసింది 10 శాతమే. వీటిలో 40 శాతం ప్రభుత్వ కళాశాలల్లో యంత్రాల కొనుగోలు ఎలా చేయాలంటూ ప్రిన్సిపాళ్లు మల్లగుల్లాలు పడుతున్నారు. దీనిపై జరిగిన సమావేశంలోనే వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని కళాశాలల యాజమాన్యాలు కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు సుమారు 1.30 లక్షలు ఉండగా, ఇప్పటిదాకా కేవలం ఐదు శాతం కూడా నమోదు ప్రక్రియ పూర్తి కాలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ఏడాది ఫీజు రియింబర్స్‌మెంట్ వచ్చేది సగం విద్యార్థులకేన ని సంబంధిత అధికారులే అంగీకరిస్తున్నారు. ప్రభుత్వం కొత్త విధానంపై పునరాలోచించి, చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ఉపకారానికీ బయోమెట్రిక్
కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఫీజు, ఉపకార వేతనాలు ఇక నుంచి బయోమెట్రిక్ సిస్టమ్‌పై ఆధారపడనున్నాయి. ప్రభుత్వం బయోమెట్రిక్ సిస్టం ప్రవేశపెడుతున్నట్లు ‘సాక్షి’ 2013 డిసెంబర్ 16న ‘రోజుకో నిబంధన... విద్యార్థులకు వేదన’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. ఈ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలలకు చెందిన విద్యార్థుల వేలి ముద్రలను బయో మెట్రిక్ మిషన్‌పై తీసుకునే విధానంపై మంగళవారం ప్రిన్సిపాళ్లతో సంక్షేమశాఖ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డెమో నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్లోని డ్వామా భవనంలో జరిగిన సమావేశంలో సాంఘీక సంక్షేమశాఖ ఉప సంచాలకులు ఎంఎస్ శోభారాణి, జిల్లా బీసీ సంక్షేమాధికారి బి. రవిచంద్ర, జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఆర్ఎం గిరిధర్‌రావు పాల్గొన్నారు. అనంతరం డీడీ శోభారాణి ఇందుకు సంబంధించి ప్రిన్సిపాళ్లకు డెమో ఇచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలకు అర్హులైన విద్యార్థుల వేలి ముద్రల సేకరణకు పీఓఎస్ డివైస్ సిస్టం ఉన్న మిషన్‌ను కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. ఈ సిస్టమ్‌లో ప్రతి విద్యార్థి వేలి ముద్రలు వేసిన వెంటనే వారికి సంబంధించిన పూర్తి సమాచారం వస్తుంద న్నారు. ఈ వివరాలకు సంబంధించి హార్డ్‌కాపీలను సంబంధిత సంక్షేమ శాఖ కార్యాలయాలకు పంపించాల్సి ఉందని, ఈ కార్యాలయాల్లో ప్రతి విద్యార్థికి ఒక బార్కోడ్ కేటాయిస్తారని తెలిపారు. వారు పంపించిన వివరాలు, విద్యార్థి బార్‌కోడ్‌కు మ్యాచ్ అయితేనే ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. 2న ప్రిన్సిపల్ సెక్రెటరీ వీడియో కాన్ఫరెన్స్.. బయో మెట్రిక్ సిస్టంపై మరింత అవగాహన కల్పించేందుకు ఈ నెల 2న జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలల ప్రిన్సిపాళ్లతో సాంఘీక సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు శోభారాణి తెలిపారు. అందరూ హాజరు కావాలని కోరారు.