ఉపకారానికీ బయోమెట్రిక్ | biometric for scholarship | Sakshi
Sakshi News home page

ఉపకారానికీ బయోమెట్రిక్

Published Wed, Jan 1 2014 2:44 AM | Last Updated on Wed, Sep 5 2018 9:18 PM

biometric for scholarship

కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఫీజు, ఉపకార వేతనాలు ఇక నుంచి బయోమెట్రిక్ సిస్టమ్‌పై ఆధారపడనున్నాయి. ప్రభుత్వం బయోమెట్రిక్ సిస్టం ప్రవేశపెడుతున్నట్లు ‘సాక్షి’ 2013 డిసెంబర్ 16న ‘రోజుకో నిబంధన... విద్యార్థులకు వేదన’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. ఈ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలలకు చెందిన విద్యార్థుల వేలి ముద్రలను బయో మెట్రిక్ మిషన్‌పై తీసుకునే విధానంపై మంగళవారం ప్రిన్సిపాళ్లతో సంక్షేమశాఖ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డెమో నిర్వహించారు.

స్థానిక కలెక్టరేట్‌లోని డ్వామా భవనంలో జరిగిన సమావేశంలో సాంఘీక సంక్షేమశాఖ ఉప సంచాలకులు ఎంఎస్ శోభారాణి, జిల్లా బీసీ సంక్షేమాధికారి బి. రవిచంద్ర, జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఆర్‌ఎం గిరిధర్‌రావు పాల్గొన్నారు. అనంతరం డీడీ శోభారాణి ఇందుకు సంబంధించి ప్రిన్సిపాళ్లకు డెమో ఇచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలకు అర్హులైన విద్యార్థుల వేలి ముద్రల సేకరణకు పీఓఎస్ డివైస్ సిస్టం ఉన్న మిషన్‌ను కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. ఈ సిస్టమ్‌లో ప్రతి విద్యార్థి వేలి ముద్రలు వేసిన వెంటనే వారికి సంబంధించిన పూర్తి సమాచారం వస్తుంద న్నారు.

 ఈ వివరాలకు సంబంధించి హార్డ్‌కాపీలను సంబంధిత సంక్షేమ శాఖ కార్యాలయాలకు పంపించాల్సి ఉందని, ఈ కార్యాలయాల్లో ప్రతి విద్యార్థికి ఒక బార్‌కోడ్ కేటాయిస్తారని తెలిపారు. వారు పంపించిన వివరాలు, విద్యార్థి బార్‌కోడ్‌కు మ్యాచ్ అయితేనే ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.
 2న ప్రిన్సిపల్ సెక్రెటరీ వీడియో కాన్ఫరెన్స్..
 బయో మెట్రిక్ సిస్టంపై మరింత అవగాహన కల్పించేందుకు ఈ నెల 2న జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలల ప్రిన్సిపాళ్లతో సాంఘీక సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు శోభారాణి తెలిపారు. అందరూ హాజరు కావాలని కోరారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement