‘ఫీజు’పై ‘భయో’మెట్రిక్ | biometric link for scholarship and fee reimbursement | Sakshi
Sakshi News home page

‘ఫీజు’పై ‘భయో’మెట్రిక్

Published Wed, Jan 1 2014 2:59 AM | Last Updated on Wed, Sep 5 2018 9:00 PM

biometric link for scholarship and fee reimbursement

 నర్సీపట్నం, న్యూస్‌లైన్ :
 ఒక వైపు ఆధార్... మరో వైపు బయోమెట్రిక్... ఇలా ఏటా కొత్త నిబంధనలు అమల్లోకి తెస్తున్న ప్రభుత్వం పరోక్షంగా పథకంలో కోతలకు ప్రోత్సహిస్తోంది. నిధులు మంజూరులో నిర్లక్ష్యం చేస్తూ  క్షేత్రస్థాయి పరిస్థితిని పట్టించుకోకుండా కొత్త విధానాలకు శ్రీకారం చుడుతోంది. ఈ విద్యా సంవత్సరం ముగియడానికి మరో మూడు నెలలే ఉంది. ఇంత తక్కువ సమయంలో పాత నిబంధనలతోనే జిల్లాలోని సుమారు లక్షా 30 వేల మంది విద్యార్థుల దరఖాస్తు ప్రక్రియ పూర్తి కావడం కష్టమవుతుంది. ఈ పరిస్థితుల్లో నిధులు పక్కదారి పడుతున్నాయనే సాకుతో కొత్తగా బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తెచ్చి, మూడు నెలల్లో నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. స్వల్ప వ్యవధిలో ఎలా పూర్తవుతుందంటూ కళాశాలల యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి. గతంలా కాకుండా అధికారుల స్థానంలో యాజమాన్యాలే విద్యార్థుల దరఖాస్తులపై విచారణ చేసేలా బయో మెట్రిక్ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ విధానంలో విద్యార్థి ఆన్‌లైన్ చేసిన దరఖాస్తును బయోమెట్రిక్ యంత్రం ద్వారా కళాశాల ప్రతినిధి పరిశీలన చేయాల్సి ఉంది. ఇది పూర్తయ్యాక విద్యార్థి వేలిముద్ర ద్వారా ఆధార్ సర్వర్‌తో అనుసంధానమవుతుంది. అనంతరం జిల్లా అధికారులకు చేరిన దరఖాస్తును బార్ కోడ్ విధానంతో చూసి, ట్రెజరీల ద్వారా విద్యార్థికి ఫీజులు మంజూరు చేస్తారు.
 
     అయితే ఈ విధానం అమలుకు రూ. 30 వేల విలువ చేసే బయోమెట్రిక్ యంత్రాలను కళాశాలల యాజమాన్యాలే కొనుగోలు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటివరకు జిల్లాలో ఉన్న 527 కళాశాలల్లో ఈ యంత్రాలను కొనుగోలు చేసింది 10 శాతమే. వీటిలో 40 శాతం ప్రభుత్వ కళాశాలల్లో యంత్రాల కొనుగోలు ఎలా చేయాలంటూ ప్రిన్సిపాళ్లు మల్లగుల్లాలు పడుతున్నారు. దీనిపై జరిగిన సమావేశంలోనే వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని కళాశాలల యాజమాన్యాలు కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత ఉన్న  ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు సుమారు 1.30 లక్షలు ఉండగా, ఇప్పటిదాకా కేవలం ఐదు శాతం కూడా నమోదు ప్రక్రియ పూర్తి కాలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ఏడాది ఫీజు రియింబర్స్‌మెంట్ వచ్చేది సగం విద్యార్థులకేన ని సంబంధిత అధికారులే అంగీకరిస్తున్నారు. ప్రభుత్వం కొత్త విధానంపై పునరాలోచించి, చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement