డాక్టర్ రెడ్డీస్ చేతికి...బెల్జియం యూసీబీ బ్రాండ్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : బెల్జియం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఔషధ సంస్థ యూసీబీకి చెందిన కొన్ని బయో ఫార్మాసూటికల్స్ బ్రాండ్స్‌ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ కొనుగోలు చేసింది. దీంతో ఇండియా, నేపాల్, శ్రీలంక, మాల్దీవుల దేశాల్లో యూసీబీకి చెందిన కొన్ని బ్రాండెడ్ ఔషధాలు డాక్టర్ రెడ్డీస్ పరమవుతాయి. సుమారు రూ. 800 కోట్లతో (118 మిలియన్ యూరోలు) యూసీబీ బ్రాండ్లను కొనుగోలు చేసినట్లు డాక్టర్ రెడ్డీస్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 2014లో ఈ బ్రాండ్స్ అమ్మకాల విలువ రూ. 150 కోట్లుగా ఉంది.
ఈ ఒప్పందం ప్రకారం యూసీబీకి చెందిన 350 మంది ఉద్యోగులు కూడా డాక్టర్ రెడ్డీస్ పరిధిలోకి రానున్నారు. ఈ కొనుగోలుతో డిమాండ్ అధికంగా ఉండే, చిన్న పిల్లలు, చర్మ, శ్వాస సంబంధిత రంగాల్లోకి అడుగుపెట్టనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అలోక్ సోనిగ్ తెలిపారు. బాగా ప్రాచుర్యం పొందిన అట్రాక్స్, నూట్రోపిల్, ఎక్స్‌వెజైడాల్ వంటి బ్రాండ్స్ తమపరమైనట్లు తెలిపారు. వచ్చే మూడు నెలల్లో ఈ ఒప్పందం పూర్తవుతుందన్న ఆశాభావాన్ని అలోక్ వ్యక్తం చేశారు.ఈ వార్తల నేపథ్యంలో బుధవారం డాక్టర్ రెడ్డీస్ షేరు ఒక శాతం పెరిగి రూ. 3,526 వద్ద ముగిసింది.