'నారా అమరావతినాయుడు అని పెట్టుకోవాల్సింది'
శ్రీశైలం: రాష్ట్ర రాజధాని అమరావతిని సింగపూర్ తరహాలో తీర్చిదిద్దాలని కలలు కంటున్న నారా చంద్రబాబునాయుడు పేరు మార్చుకుని నారా అమరావతి నాయుడు అని పేరు పెట్టుకుంటే బాగుంటుందని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బెరైడ్డి రాజశేఖరరెడ్డి ఎద్దెవా చేశారు. ఆదివారం శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. గుంటూరు విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటు చేస్తూ ఈ రోజు రాయలసీమకు వస్తున్న ఆదాయం కూడా అమరావతి నిర్మాణం కోసం ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు. బాబుకు అమరావతి తప్ప వేరే ఆలోచన లేదా ? ప్రజలు ఆయన పార్టీని ఎన్నుకునది అమరావతి కోసమా అని సూటిగా ప్రశ్నించారు. అసెంబ్లీ సీట్లలో రాయలసీమలో 52 సీట్లు ఉన్నాయన్నారు. అయినప్పటికీ రాయలసీమను మజరా ప్రాంతంగా తయారు చేసి చిన్న చూపు చూస్తున్నారని తెలిపారు.
ప్రత్యేక హోదా విషయంపై తారస్థాయికి చేరుకుందని, రాష్ట్ర విభజన జరిగే సమయంలో కూడా రాయల తెలంగాణాను రాయలసీమ నాయకులే తెరపైకి తీసుకువచ్చారని, ఇది దుర్మార్గమైన ఆలోచన అని బెరైడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. అలాగే రాష్ట్రపతి ప్రణబ్‌ను కలిసి చాలాసేపు ఈ విషయంపై మాట్లాడామని, రాయలసీమలో ఉన్న రెండు జిల్లాలను తెలంగాణాలో కలిపితే ఆదిశేషుని తలగా భావిస్తున్న తిరుమల వెంకన్నను, తోకభాగంగా భావిస్తున్న శ్రీశైలం మల్లన్నను విడగొట్టినట్లవుతుందని వివరించినట్లు చెప్పారు.
రాయలసీమలోని నాలుగు జిల్లాలు విడిపోకుండా ఉన్నాయంటే రాజకీయ శక్తుల నుంచి తప్పించుకుందంటే ఇది రాయలసీమ పరిరక్షణ సమితికి ఘనవిజయంగా పేర్కొన్నారు. ఒక పక్క కరువు, మరొక పక్క వర్షాలే లేవు. రైతులు విత్తనాలు వేసినా ఎండిపోతున్నాయన్నారు. ప్రధానితో 1.50 గంటలు మాట్లాడినట్లు ముఖ్యమంత్రి చెబుతున్నారని, అందులో కర్నూలు గురించి ఏ విషయమైనా మాట్లాడారా అన్ని ప్రశ్నించారు. రాయలసీమకు జరిగే అన్యాయాలపై రాయలసీమ పరిరక్షణ సమితి అనుక్షణం పోరాడుతుందని సీమకు నష్టం కలిగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.