హోంశాఖను కాదని.. నలుగురికి రాష్ట్రపతి క్షమాభిక్ష
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అరుదైన నిర్ణయం తీసుకున్నారు. మరణశిక్ష పడిన నలుగురు ఖైదీలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ క్షమాభిక్ష పెట్టారు. కేంద్ర హోం శాఖ సిఫారసులను పక్కకు పెట్టి మరీ.. వీరికి విధించిన మరణశిక్షను యావజ్జీవ ఖైదుగా మారుస్తూ రాష్ట్రపతి సంతకం చేశారు. 1992లో బిహార్లో అగ్రవర్ణాలకు చెందిన 34 మందిని హత్య చేసిన కేసులో కృష్ణ మోచీ, నన్హే లాల్ మోచీ, బిర్క్యూర్ పాశ్వాన్ , ధర్మేంద్ర సింగ్ అలియాస్ దారూసింగ్లకు 2001లో సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది. సుప్రీంకోర్టు కూడా కింది కోర్టు తీర్పును సమర్థించింది.
ఈ నేపథ్యంలో వీరి తరఫున బిహార్ ప్రభుత్వం దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్లను కేంద్ర హోం శాఖ గతేడాది ఆగస్టు 8న తిరస్కరించింది. అయితే ఈ కేసుకు సంబంధించి క్షమాభిక్ష పిటిషన్ల పరిశీలనలో జరిగిన జాప్యం, జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ఆర్సీ) గుర్తించిన పలు విషయాలను రాష్ట్రపతి పరిగణనలోకి తీసుకుని మరణశిక్షను యావజ్జీవ ఖైదుగా మారుస్తూ సంతకం చేశారు.