అయ్యో.. ఆడపిల్ల
♦ అసలే అవివాహిత ఆపై ఆడపిల్లకు జననం
♦ గత్యంతరం లేక వదిలించుకునేందుకు యత్నం
♦ కేసు నమోదు ∙నీలోఫర్‌కు తల్లీబిడ్డ తరలింపు
నాచారం: అసలే అవివాహిత..తెలిసీ తెలియక చేసిన తప్పుకు ఆడపిల్ల్లకు జన్మనిచ్చింది. ఆ భారాన్ని వదిలించుకునేందుకు పసికందును నిర్దాక్షిణ్యంగా వదిలివెళ్లాలని చూసిన తల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ వెంకట్ రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సోమవారం నాచారం ఈఎస్ఐ ఆసుపత్రిలో ఓ గర్భిణి అడ్మిట్ అయ్యింది. సోమవారం రాత్రి బాత్ రూం వెళ్లిన ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆ తరువాత దిక్కుతోచక పసికందును పార్కింగ్ ఏరియాలో వదిలి వెళ్లింది.
పాప ఏడుపు విన్న ఆసుపత్రి సిబ్బంది చిన్నారిని చేరదీసి ఆరా తీయగా తన బిడ్డగా అంగీకరించింది. తనకు ఇంకా పెళ్లి కాలేదని, పుట్టిన బిడ్డను ఏమి చేయాలో దిక్కుతోచక వదిలివెళ్లాలనుకున్నట్లు తెలిపింది. దీంతో ఆసుపత్రి సిబ్బంది నాచారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తల్లి బిడ్డలను నీలోఫర్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.