మొబైల్ ఫోన్ కంపెనీలకు కేంద్రం షాక్
♦ బీఐఎస్ రిజిస్ట్రేషన్‌కు నెల మాత్రమే గడువు
♦ ఆందోళనలో మొబైల్ కంపెనీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : బీఐఎస్ రిజిస్ట్రేషన్‌కు గడువు పొడిగించాలన్న మొబైల్ తయారీ కంపెనీల విన్నపానికి కేంద్ర కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ స్పందించింది. గడువు తేదీని ఆగస్టు 13 నుంచి సెప్టెంబరు 13కు మార్చింది. అయితే నెల రోజుల గడువు మాత్రమే ఇవ్వడంతో కంపెనీలు షాక్ తిన్నాయి. వాస్తవానికి మొబైల్ ఫోన్ల నాణ్యత ప్రమాణాలను పరీక్షించే ల్యాబ్‌లు భారత్‌లో ఎనమిది మాత్రమే ఉన్నాయి. వేలాదిగా వస్తున్న మొబైళ్లు, బ్యాటరీలు, చార్జర్ల పరీక్షలు కేవలం ఎనమిది ల్యాబ్‌లతో సాధ్యం కాదు. అందుకే మరిన్ని ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలంటూ కొన్ని నెలలుగా పరిశ్రమ డిమాండ్ చేస్తూనే ఉంది.
అయినప్పటికీ కేంద్రం డెడ్‌లైన్‌ను వాయిదా వేస్తోందే తప్ప ల్యాబ్‌ల ఏర్పాటుపై ఆసక్తి కనబర్చలేదు. తాజాగా కూడా నెల రోజుల వాయిదాతో ప్రభుత్వం సరిపెట్టి అసలు విషయాన్ని విస్మరించింది. చార్జర్లు, బ్యాటరీలకు మాత్రం గడువును డిసెంబరు 1 వరకు పొడిగించింది.భారత్‌లో అమ్ముడయ్యే అన్ని మొబైల్ ఫోన్లతో పాటు ఛార్జర్లు, బీఐఎస్ ధ్రువీకరణ తప్పనిసరి. 2015 మే నుంచి అమలులోకి రావాల్సిన ఈ నిబంధన వాయిదా పడుతూ వస్తోంది.