అవిశ్వాస తీర్మానానికి మద్దతు: బీజేడీ
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తామని బిజు జనతా దళ్(బీజేడీ) ప్రకటించింది. సీమాంధ్ర ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పార్లమెంట్లో చర్చకు వస్తే తమ మద్దతు ఉంటుందని బీజేడీ ఎంపీ జయ పాండా తెలిపారు. తెలంగాణ, సీమాంధ్ర అంశాలు తమకు సంబంధంలేదని ఆయన స్పష్టం చేశారు.
తమ పార్టీ యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకమని చెప్పారు. ఒడిశా ప్రజలు యూపీఏ సర్కారు కొనసాగాలని కోరుకోవడం లేదన్నారు. తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన తమ రాష్ట్రానికి యూపీఏ ప్రభుత్వం అరకొర సాయం అందించి చేతులు దులుపుకుందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం దేశానికి చేసింది కూడా ఏమీ లేదని జయ పాండా అన్నారు. లోక్సభలో బీజేడీకి 14 మంది ఎంపీలున్నారు.