ముగ్గురు గవర్నర్ల రాజీనామా
న్యూఢిల్లీ : యూపీఏ హయాంలో నియమితులయిన గవర్నర్లకు కేంద్ర ప్రభుత్వం ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధం చేసింది. కర్ణాటక, అసోం, ఉత్తరప్రదేశ్ గవర్నర్లు మంగళవారం తమ పదవులకు రాజీనామా చేశారు. యూపీ గవర్నర్ బీఎల్ జోషీ తొలుతు తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీమానా లేఖను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పంపారు. తాజాగా కర్ణాటక గవర్నర్ భరద్వాజ్, అసోం గవర్నర్ జేబీ పట్నాయక్ రాజీనామా చేశారు.
అదే బాటలో మరి కొందరు గవర్నర్లు ఉన్నారు. కేళర గవర్నర్ షీలా దీక్షిత్, శివరాజ్ పాటిల్, ఎంకే నారాయణ్ కూడా తమ పదవులకు రాజీనామ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వారికి సంకేతాలు వెళ్లినట్లు సమాచారం. మరోవైపు రాజస్తాన్ గవర్నర్ మార్గరేట్ అల్వా ఈరోజు ప్రధాని మోడీతో భేటీ అయ్యారు.
కాగా యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లు స్వచ్ఛందంగా తమ పదవులకు రాజీనామాలు చేయాలని బీజేపీనేత సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యానించారు. యూపీఏ పాలనలో సోనియా విధేయులే గవర్నర్లుగా నియమితులయ్యారని, రాజకీయ లబ్ది కోసమే గవర్నర్ల నియామకం జరిగిందని ఆయన ఆరోపించారు. అర్హత లేకున్నా వారికి గవర్నర్లుగా పదవి కట్టబెట్టారని కాంగ్రెస్ నేతలు షీలా దీక్షిత్, ఎంకే నారాయణ, శివరాజ్పాటిల్ను ఇలాగే గవర్నర్లుగా నియమించారని సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు.