స్త్రీ వాదానికి... సినీ గృహప్రవేశం : 70
ఫెమినిజమ్... మాకూ స్వేచ్ఛా స్వాతంత్య్రాలున్నాయని ప్రవచించే స్త్రీ వాదం... తెలుగు సాహిత్యంలో 1990ల్లో బలంగా వినపడి, ఆధునికమని పించిన కాన్సెప్ట్! మరి, మన సినిమాల్లో తొలిసారిగా ఆ వాదం, అలాంటి పాత్ర చాలా బలంగా ఎప్పుడు కనిపించింది? ఇటీవల వచ్చిన ఏ కలర్ సినిమాల్లోనో అనుకుంటున్నారా? కాదు... ఇవాళ్టికి సరిగ్గా 70 ఏళ్ళ క్రితం రిలీజైన ఓ బ్లాక్ అండ్ వైట్ సినిమాలో! ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం.
సారథీ వారి ‘గృహప్రవేశం’ (1946 అక్టోబర్ 4న రిలీజ్) చూడండి. గూడవల్లి రామబ్రహ్మం ‘మాలపిల్ల’, ‘రైతుబిడ్డ’ లాంటి చిత్రాలతో అభ్యుదయ పంథా చిత్రాలకు చిరునామా అయిన సారథీ సంస్థ... దర్శక - నటుడు ఎల్వీ ప్రసాద్, రచయిత త్రిపురనేని గోపీచంద్, తరువాతి కాలపు ప్రముఖ దర్శక- నిర్మాత కె.ఎస్. ప్రకాశరావు (దర్శకుడు కె. రాఘవేంద్రరావు తండ్రి) లాంటి మహామహుల కలయికతో తెరపైకి వచ్చిన ఆధునిక భావాల దర్పణం - ‘గృహప్రవేశం’.
ఆడవాళ్ళకి హక్కులే ఉండరాదనే మహిళాద్వేషి హీరో (ఎల్వీ ప్రసాద్). స్త్రీ స్వేచ్ఛను కోరే ఆధునిక యువతి హీరోయిన్ (భానుమతి). సవతి తల్లి ఆరళ్ళు, బలవంతపు పెళ్ళిపోరు పడలేక హీరోయిన్ ఇల్లు వదిలొస్తుంది. హీరో ఇంట్లో తలదాచుకోవడానికి వస్తుంది. వారిద్దరి మధ్య కావలసినంత చర్చ. నాటకీయ పరిణామాలు. ఆఖరికి బ్రహ్మచర్యాన్ని గొప్పగా భావించి, సమాజాభి వృద్ధికి స్త్రీ, సంసారం అవరోధమన్న హీరోకి కనువిప్పు. వారిద్దరి పెళ్ళితో సంసార ‘గృహప్రవేశం’ - ఇదీ చిత్ర కథ. హీరోయిన్ని పెళ్ళాడాలని తపించే సవతి తల్లి తమ్ముడి కామెడీ విలనిజమ్ కథకు అదనపు హంగు.
దర్శకుడిగా ఎల్వీ ప్రసాద్కిది తొలి చిత్రం. ప్రభుత్వోద్యోగి కావడం వల్ల సోదరుడు నళినీకాంతరావు పేరుతో తెరపై చలామణీ అయిన లలిత సంగీత దిగ్గజం రజనీకాంతరావుకు పూర్తిస్థాయి సంగీత దర్శకుడిగా ఇదే తొలి ప్రయత్నం. అసలు ఈ చిత్రానికి గోపీచంద్ దర్శకత్వం వహిస్తే, ఎల్వీ ప్రసాద్ సహాయకుడిగా వ్యవహరించాలని మొదట భావించారు. కానీ, చివరకు పెట్టుబడిదారుల సలహా మేరకు దర్శకత్వ బాధ్యత ఎల్వీకే అప్పగించి, గోపీచంద్ రచనకే పరిమితమయ్యారు. కానీ, ఆయన అభ్యుదయ భావాలకు అనుగుణంగానే సినిమా రూపొందింది. ప్రకాశరావు సగంలోనే నిర్మాణ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. దర్శకుడికీ, రచయితకీ మధ్య అభిప్రాయాల్లో ఎక్కడైనా తేడాలుంటే, ఎల్వీ గురువులు హెచ్.ఎం. రెడ్డి, హెచ్.వి. బాబుల నిర్ణయంతో అంతా సర్దుబాటయ్యేదని అప్పటి జర్నలిస్టు స్వర్గీయ ఎం.ఎస్. శర్మ గతంలో ‘సాక్షి’తో చెప్పారు.
బలమైన సాంఘిక సమస్యను సైతం వినోదం మేళవించి చెప్పే ఎల్వీ ప్రసాద్ శైలికి ఈ సినిమా నాంది. తరువాత ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్ళి చేసి చూడు’(వరకట్నం), ‘మిస్సమ్మ’ (నిరుద్యోగ సమస్య) - ఇలా పోనుపోనూ ఆ ధోరణి బలపడింది. బాక్సాఫీస్ సూత్ర మైంది. ‘గృహప్రవేశం’లో తెరపై హీరో హీరోయిన్లు ఎల్వీ, భానుమతి. కానీ, అత్యంత కీలకం - ఆధునిక గిరీశం లాంటి రమణరావు పాత్రలో సీయస్సార్ ఆంజనేయులు కామెడీ విలనీ నటన. ‘మై డియర్ తులశమ్మక్కా’ అంటూ చిత్రమైన డైలాగ్ డెలివరీ, ‘జానకి నాదేనోయ్’ లాంటి పాటలు స్వయంగా పాడుతూ చేసిన అభినయం సీయస్సార్ బహుముఖ కౌశలంలో కలికితురాయి. కావాలంటే, అప్పట్లో విశేష ప్రేక్షకాదరణ పొంది, ఇప్పటికీ ఛానల్స్‌లో తరచూ వచ్చే ఈ సినిమా చూడండి. ఆ రోజుల్లోనే అపర ఫెమినిస్టు పాత్రలో భానుమతిని గమనించండి.
ఆమె మధురగీతాలు వినండి.
అలనాటి అపురూప చిత్రమైన ‘గృహప్రవేశం’ 70 ఏళ్ళ పండుగ ఎల్వీ కుమారుడు - ప్రసాద్ ల్యాబ్స్ రమేశ్‌ప్రసాద్ సారథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో జరగనుంది. స్త్రీలకివ్వాల్సిన గౌరవం, కుహనా సన్న్యా సుల అక్రమాలు, కబుర్ల రాయుళ్ళ వ్యవహారాలు - ఇలా ‘గృహప్రవేశం’ లోని చాలా ఇప్పటికీ వర్తించేవే. ఇవాళ్టికీ పదే పదే కనిపిస్తున్న బాక్సాఫీస్ సూత్రాలే. కాలాని కన్నా ముందే అభ్యుదయ భావనతో వచ్చిన ఒక అపురూప ప్రయత్నానికి అది ఒక గీటురాయి!
- రెంటాల జయదేవ