బ్లాక్‌బెర్రీ.. ‘జడ్30’ వచ్చింది...
న్యూఢిల్లీ: బ్లాక్‌బెర్రీ కంపెనీ కొత్త స్మార్ట్‌ఫోన్.. ‘జడ్30’ను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. తాజా ఆపరేటింగ్ సిస్టమ్ బ్లాక్‌బెర్రీ 10.2 వెర్షన్‌పై పనిచేసే ఈ ఫోన్ ధర రూ.39,900. ఈ ఫోన్ అసలు ధర రూ.44,990 అని, కానీ పండుగ సీజన్ సందర్భంగా ధర తగ్గించి అందిస్తున్నామని, వచ్చే వారం నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని కంపెనీ పేర్కొంది. 12 నెలవారీ వాయిదాల్లో(ఈఎంఐ) కూడా దీన్ని కొనుగోలు చేయొచ్చు. పెద్ద డిస్ప్లే, అధిక బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వారికోసం ఈ ఫోన్‌ను అందిస్తున్నామని బ్లాక్‌బెర్రీ ఇండియా ఎండీ సునీల్ లాల్వానీ చెప్పారు.
బ్లాక్‌బెర్రీ నుంచి వస్తున్న పెద్ద స్క్రీన్(5 అంగుళాల సూపర్ అమెలెడ్) ఫోన్ ఇది. దేశీ మార్కెట్లో ‘హింగ్లిష్’ టెక్స్ట్‌ను సపోర్ట్ చేస్తున్న తొలి ఫోన్ ఇదేనన్నారు. జడ్30లో 1.7 గిగాహెర్ట్స్ ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 64 జీబీ మైక్రోకార్డ్ స్లాట్, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. వంద డాలర్ల ధరలోపు ధరల్లో వచ్చే ఏడాది ఫోన్లను అందిస్తామని సునీల్ పేర్కొన్నారు.