నాయకుల నిర్లక్ష్యం.. నెరవేరని లక్ష్యం..
మంచిర్యాలసిటీ, న్యూస్‌లైన్ : మాయమాటలతో తిమ్మిని బమ్మిని చేసి.. చేసే పనిలో చిత్తశుద్ధిలేని నాయకుల నిర్లక్ష్యంతో మంచిర్యాల జిల్లా ఏర్పాటు హామీలకే పరిమితమవుతోంది. తూర్పు జిల్లా కేంద్రంగా విరాజిల్లుతున్న మంచిర్యాలకు తలాపునే గోదారమ్మ, మరోవైపు సిరులు గురిపిస్తున్న నల్లబంగారం గనులు ఉన్నా యి. వీటికితోడు పచ్చని అటవీ సంపద ఉంది. వీటన్నింటినీ కలుపుకుని పారిశ్రామిక జిల్లాగా ఏర్పడాలని సంబరపడిపోతున్న మంచిర్యాల 1983 నుంచి నిరాదారణకు గురవుతూనే ఉంది.
పసలేని ప్రసంగాలతో మాయమాటలు చెప్పి.. ఓట్లు వేయించుకుని గద్దె ఎక్కగానే అసలు విషయాన్ని నాయకులు మరచిపోవడం సాధారణమైంది. అల్లంత దూరాన ఉన్న ఆదిలాబాద్‌కు చిన్న, చిన్న పనులకు వెళ్లాలంటే రోజు గడుస్తోంది. ‘నాయకులారా మా కు సొంత జిల్లా ఏర్పాటు చేసి మా కష్టాలు తీర్చండి’ అంటూ అరచినా ఆలకించే వారు కరువయ్యారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయంటే మంచిర్యాల జిల్లా సమస్య నాయకులకు గుర్తుకొస్తుంది. ఇచ్చిన హామీ మంచిర్యాలకే పరిమితమై పోతుంది. మంచిర్యాల జిల్లా ఏర్పాటుకు సంబంధించిన కాగితాలు అసెంబ్లీ వరకు వె ళ్లడం లేదనేది వాస్తవం.
ఎన్టీఆర్ పర్యటనతో..
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 1983లో ఎన్నికల పర్యటనకు వచ్చినప్పుడు నాటి బహిరంగ సభలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మంచిర్యాలను జిల్లా చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ అమలు కాకపోవడంతో 1985లో మంచిర్యాల ప్రజలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. 1993లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కరరెడ్డి జిల్లా ఏర్పాటుకు హామీ ఇచ్చారు.
1999లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అడ్డు వస్తున్న నేపథ్యంలో మంచిర్యాలను జిల్లాగా ప్రకటించలేకపోతున్నానని, లేదంటే ఇప్పుడే ప్రకటించే వాడినంటూ అప్పుడే ఇచ్చేసినంత అవేశంగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కాకలు తీరిన యోధుడు కాక గడ్డం వెంకటస్వామి ఎన్నికల్లో పోటీచేసిన ప్రతిసారీ ఇదే పాట పాడారు. తెలంగాణ ఏర్పడ్డాక తొలి సంతకం మంచిర్యాల జిల్లా ఏర్పాటు ఫైలు పైననే చేస్తానని తనేం తక్కువా అన్నట్టు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ సైతం హామీ ఇచ్చారు.
ప్రతిపాదన
తూర్పు ప్రాంతంలోని మంచిర్యాల, చెన్నూర్, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, సిర్పూర్, బెల్లంపల్లి, కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖని, మంథని, రామగుండం ప్రాంతాలను కలుపుకుని మంచిర్యాల కేంద్రంగా పారిశ్రామిక జిల్లా ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదన.
పరిశ్రమలే మహాబలం..
మంచిర్యాల, మందమర్రి, కాసిపేట, తాండూరు, రెబ్బన, తి ర్యాణి మండలాల్లో బొగ్గు గనులు ఉన్నాయి. దేవాపూర్, మంచిర్యాలలో సిమెంటు పరిశ్రమలు ఉన్నాయి. పదుల సం ఖ్యలో సిరామిక్స్ పరిశ్ర మలు, కాగజ్‌నగర్‌లో కాగితపు పరిశ్ర మ ఉంది. వీటితోపాటు తూర్పు ప్రాంతంలో పదుల సంఖ్య లో కార్పొరేటు విద్యాసంస్థలు ఏర్పడ్డాయి.
తూర్పు భౌగోళికం..
తూర్పులో 25 మండలాలు, మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. మంచిర్యాల, ఆసిఫాబాద్ రెవిన్యూ డివిజన్లు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాకు వెళ్లడానికి తూర్పులోని పలు ప్రాంతాల నుంచి 160 కిలో మీటర్ల నుంచి 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. జిల్లా జనాభాలో సగానికంటే ఎక్కువగా తూర్పు ప్రాంతంలోనే ఉంది. బెజ్జూ రు, కౌటాల, దహెగాం, కోటపల్లి, వేమనపల్లి, తిర్యాని, చె న్నూరు మండలాలు అభివృద్దికి ఆమడ దూరంలో ఉన్నాయి.
వైఎస్ హయాంలో..
1998లో తూర్పు ప్రాంతంతోపాటు, కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్యెల్యేలు సంయుక్తంగా అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి జిల్లా ఏర్పాటు చేయాలంటూ వినతిపత్రం అందజేశారు. స్పందిం చిన వైఎస్ అప్పటి కలెక్టరును నివేదికలను తయారు చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లా ఏర్పాటుకు సంబంధించిన వివరాలను కలెక్టర్ పంపించారు. తూర్పులో నెలలో మూడు రోజులు మంచిర్యాలలో కలెక్టరు క్యాంపు ఏర్పాటు చే యాలని అదేశించారు. క్యాంపు కొద్ది రోజులు కొనసాగినా తదుపరి కనుమరుగైంది.
జిల్లా తప్పనిసరి..
వేమనపల్లి, బెజ్జూరు వంటి మారుమూల మండలాల్లో జిల్లా అధికారులు పర్యటించాలంటే 250 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే. తూర్పు ప్రాంత వాసులకు పక్కనే ఉన్న కరీంనగర్ 90 కిలోమీటర్లు, నిజామాబాద్ 170 కిలోమీటర్లు, రైలు మార్గంలో వరంగల్ 110, రోడ్డు మార్గంలో 170 కిలోమీటర్లు ఉంటుంది. 250 కిలోమీటర్ల దూరం నుంచి అధికారులు ఎప్పుడు వచ్చి వెళతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఎలా ఉంటుందో కానరాదు.