Black ticket danda
-
భారత్- న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ : హైదరాబాద్ లో బ్లాక్ టిక్కెట్ల దందా
-
పవన్ సినిమాను తొక్కేయడమేంటి?: మంత్రి పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్.. వాళ్ల వాళ్ల జీవితాల్లో రాజకీయాలకు వాడుకోని వస్తువు అంటూ ఏదీలేదని ఏకీపారేశారు ఏపీ సమాచారశాఖ మంత్రి పేర్ని నాని. శుక్రవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి నాని.. పవన్ కల్యాణ్ కొత్త సినిమా విషయంలో ప్రతిపక్షం చేస్తున్న రాద్ధాంతంపై స్పందించారు. ‘‘ప్రతిపక్ష నేత చంద్రబాబు అనుభవం ఏపాటిదో ఇప్పుడు అర్ధమవుతోంది. ఒక సినిమా రిలీజ్ ఉంటే దానికోసం ఈ తండ్రీకొడుకులు పిల్లి మొగ్గలు వేస్తున్నారు. పవన్ కల్యాణ్ సినిమాని మేం(ప్రభుత్వం) తొక్కడం ఏమిటి?. ఎన్టీఆర్, హరికృష్ణలను మీరూ చేసింది తొక్కడమంటే!. పవన్ సినిమా చూడమంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. టీడీపీ జెండా మోసిన జూ. ఎన్టీఆర్‌ను ఎప్పుడైనా పట్టించుకున్నారా? అంటూ పేర్ని నాని, నారా లోకేష్‌ను నిలదీశారు. జూ. ఎన్టీఆర్ సినిమాను చంద్రబాబు ఒక్కసారైనా ప్రశంసించారా? జూనియర్ ఎన్టీఆర్ సినిమా వచ్చినప్పుడు మీరు ఇలా ఎప్పుడైనా తహతహలాడారా?. కుప్పంలో వన్ సైడ్ లవ్ ఉండదు అన్నావు? ఇదేమి లవ్...ఏ సైడ్ లవ్?. పవన్ కళ్యాణ్ గురించి మేము ఎప్పుడు పట్టించుకున్నాం? అంటూ చంద్రబాబు, లోకేష్‌పై విసుర్లు విసిరారు మంత్రి నాని. మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పేర్ని నాని చంద్రబాబు ప్రతి వ్యవస్థను దిగజరిస్తే వాటిని మేము గాడిలో పెడుతున్నాం. అలాంటి మాపై దిగజారుడు మాట్లాడుతున్నారు. బ్లాక్ లో టికెట్స్ అమ్ముకోడానికి, వ్యవస్థ దెబ్బతినడానికి చంద్రబాబు కారణం. బ్లాకులో టికెట్లు అమ్ముతుంటే చూస్తూ ఉండాలా? ప్రభుత్వం నిర్దేశించిన రేటు కాకుండా వేరే రేటు అంటే చట్టాన్నే కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా?. ధరలపై ఎగ్జిబిటర్లు కోర్టుకు వెళ్లారు. ప్రభుత్వంతో సంప్రదించి ధరలను నిర్ణయించుకోండి అని చెప్పారు. సినిమా పెద్దలు వచ్చారు.. జీవో ఇస్తామన్నారు.. ఇప్పుడు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పేర్ని నాని గౌతమ్‌రెడ్డి మృతితో జీవో ఆలస్యం చట్టాన్ని గౌరవించే పెద్ద మనసు మీకు లేదు. చంద్రబాబు గతంలో మీరు నిజంగా ప్రభుత్వం నడిపారా?. ఇంతకంటే దిగజారే పరిస్థితి లేదు అనుకున్నప్పుడల్లా మరో మెట్టు దిగుతున్నాడు. బ్లాక్ లో టికెట్లు అమ్మాలని ఆందోళన చేయడం ఏమిటి?. ఎప్పుడన్నా మహేష్, చిరంజీవి సినిమాలకి ఇలా ట్వీట్ చేశారా?. మొన్ననే కమిటీ కూర్చుంది. 24నే జీవో రావాల్సి ఉంది. కానీ, గౌతమ్‌రెడ్డి మృతితో ఆలస్యమైంది అంతే. జీవో రావడం రెండు రోజులు ఆలస్యమైతే రచ్చ చేస్తున్నారు. సొంత బావమరిది శవం పక్కన రాజకీయాలు మాట్లాడింది ఎవరు?. గౌతమ్ రెడ్డి మరణిస్తే పరుగెత్తుకొచ్చి దండెసి రెండో రోజే ఆయనపై మాట్లాడిస్తాడు. మనిషి విలువ, మరణిస్తే వచ్చే బాధ చంద్రబాబుకి తెలియదు. ఈ ప్రభుత్వం ఒక ఆప్తుడ్ని కోల్పోయి బాధలో ఉంటే జీవో ఇవ్వలేదంటాడు. దీన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నాడు. మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పేర్ని నాని అఖండ సినిమా రిలీజ్ ముందు ప్రొడ్యూసర్స్ ఎమ్మెల్యే మేకా ప్రతాప అప్పారావు ద్వారా కలవడానికి ప్రయత్నం చేశారు. రమ్మంటే రెండు మూడు డేట్లు ఇవ్వాలన్నారు వాళ్ళు. విజయవాడ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో నన్ను కలవలేదా...? బాలకృష్ణ గారు నాతో మాట్లాడారు...నేను సీఎం గారితో మాట్లాడాను. ఆయన రానవసరం లేదు...పెద్దరికం పోతుంది అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఆయనకి ఏమి కావాలో చేసి పెట్టండి అని చెప్పారు. బాలకృష్ణ వ్యతిరేకంగా అలా మాట్లాడి ఉంటారని నేనైతే అనుకోవడం లేదు. సినిమా ఉచితంగా చూపిస్తాను అన్నాయనకు ఇవన్నీ ఎందుకు?. ప్రీరిలీజ్ ఫంక్షన్ ఒక రోజు పోస్ట్‌పోన్ చేసుకున్న వాళ్ళు.. సినిమా మరో రెండు రోజులు వాయిదా వేసుకోవచ్చుగా. ఆ హీరోగారు మైకు పట్టుకుంటే నీతులు చెప్తాడు...మరి ఈ నీతి మాలిన పనులేంటి..? సినిమా బాగుంటే జనం చూస్తారు. పుష్ప చూళ్ళేదా...? నాగార్జున కొడుకు సినిమా వచ్చింది చూసారుగా. అత్తారింటికి దారేది బాగుంది జనం చూసారు. అసలు సినిమాకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏముంది? అని పేర్కొన్నారు మంత్రి. దేశంలో బ్లాక్ మార్కెట్ ను పార్టీలు టీడీపీ, ఏపీ బీజేపీ లే ప్రొత్సహిస్తున్నాయని, బ్లాక్ లో టికెట్లు అమ్మితే తప్పు అని చెప్పాల్సిన వారు.. అదొక హక్కుగా చిత్రీకరిస్తున్నారని మంత్రి పేర్ని నాని ఆవేదన వ్యక్తం చేశారు. వీళ్లంతా ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై ఎంత వ్యతిరేకతతో ఉన్నారో అర్థం అవుతుందన్నారు ఆయన. -
ఐపీఎల్ ఫైనల్ టికెట్లపై అనుమానాలు?
హైదరాబాద్: స్థానిక రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ మైదానంలో రేపు జరగబోయే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. దీన్ని క్యాష్ చేసుకోవాలనుకున్న నిర్వాహకులు టికెట్లను హాంఫట్ అనేశారు. సాధారణంగా మ్యాచ్ టిక్కెట్ల గురించి పత్రికలు, టీవీ ఛానెళ్ల ద్వారా అభిమానులకు సమాచారం అందించడం ఆనవాయితీ. కానీ ఫైనల్ మ్యాచ్ కోసం ఆ ఆనవాయితీని నిర్వాహకులు పక్కకు పెట్టారు. ప్లేఆఫ్ మ్యాచ్‌ల టిక్కెట్లను పద్దతి ప్రకారమే అందుబాటులో పెట్టిన నిర్వాహకులు.. ఫైనల్ మ్యాచ్ విషయంలో ఎలాంటి ప్రకటనలు చేయకుండానే టికెట్లను అమ్మకానికి పెట్టారు. ఫైనల్ మ్యాచ్ టికెట్లను ఈవెంట్స్ .కామ్ సంస్థ ఆన్లైన్లో టిక్కెట్ల విక్రయం ప్రారంభించింది. గుట్టుచప్పుడు కాకుండా టిక్కెట్ల అమ్మకాలు మొదలుపెట్టిన ఆ సంస్థ రెండు నిమిషాల్లోనే అన్నీ అమ్ముడైనట్లు చూపించింది. అయితే వెబ్సైట్లో కేవలం ఎక్కువ ధరల టికెట్లను మాత్రమే అందుబాటులో ఉంచారని కామన్ టికెట్ల సంగతేంటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఎన్ని టిక్కెట్లు అమ్మకానికి పెట్టారు....? ఎన్ని అమ్ముడయ్యాయి...? ఏ టిక్కెట్లు ఎవరు కొన్నారు....? అన్న ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఈ విషయంపై ఈవెంట్స్‌నౌ ప్రతినిధిలు నోరు మెదుపటం లేదు. ఇక హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఈ వివాదంపై స్పందించకపోవడం పట్ల అనేక అనుమానాలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్ ఫైనల్ ఆదరణ దృష్ట్యా మరింత విస్తృతంగా ప్రచారం చేయాలి. ఐతే ఈవెంట్స్‌నౌ.కామ్ గానీ.. హెచ్‌సీఏ గానీ మొదట్నుంచీ టిక్కెట్ల అమ్మకంపై గుట్టుగానే ఉన్నాయి. ఎవరికీ కనీస సమాచారం అందించలేదు. రోజువారీ టిక్కెట్ల అమ్మకాల గురించి బీసీసీఐ, హెచ్‌సీఏలకు సమాచారం ఇవ్వాలి. ఈవెంట్స్‌నౌ సంస్థ ఆ పని చేసిందో లేదో తెలియదు. కొన్ని నిమిషాల వ్యవధిలో అన్ని టిక్కెట్లు అమ్ముడుపోవడం ఆశ్చర్యంగా ఉందని హెచ్‌సీఏ అధికారి ఒకరు పేర్కొనడం గమనార్హం. -
ఇలా అయితే.. ఫైనల్ మ్యాచ్ చూసేదెలా?
హైదరాబాద్: ఐపీఎల్ ఫైనల్ చూడాలని ఉత్సాహంగా వచ్చే అభిమానులకు టికెట్ల గోల్మాల్ ఇబ్బందులుగా మారింది. ఎలాగైనా ఫైనల్ మ్యాచ్ చూడాలని క్రికెట్ ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. దీనిని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న కేటు గాళ్లు బ్లాక్ టికెట్ల దందాను బహిరంగంగా మొదలెట్టేశారు. ఇక వెబ్సైట్లలో ఎలాంటి ముందుస్తు సమాచారం లేకుండానే కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే టికెట్లను అందుబాటులో ఉంచారు. అనంతరం సర్వర్ డౌన్ అయిందని బుకాయించిన నిర్వాహకులు.. వెంటనే సోల్డ్ ఔట్ అని పెట్టేశారు. ఇక ఆ కొద్ది నిమిషాల్లో టికెట్లు బుక్ చేసుకున్నవారు జింఖానా గ్రౌండ్స్‌కు వచ్చి టికెట్లు తీసుకోవడానికి దాదాపు ఐదు గంటలకు పైగా క్యూ లైన్లలో పడిగాపులు పడుతున్నారు. ఇక అన్ని సైట్లలలో టికెట్స్ సోల్డ్ ఔట్ దర్శనమిస్తున్నప్పటికీ బ్లాక్‌లో మాత్రం టికెట్ల దందా జోరుగా సాగుతోంది. టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్స్, ఉప్పల్ స్టేడియం చుట్టూ క్రికెట్ ఫ్యాన్స్ చక్కర్లు కొడుతున్నారు. స్టేడియం వెలుపల రూ. 2 వేల టికెట్లను బ్లాక్‌లో రూ.5 వేల నుంచి రూ. 6 వేల వరకు అమ్ముతున్నారని అభిమానులు పేర్కొంటున్నారు. దాదాపు 36 వేల సిట్టింగ్ కెపాసిటీ ఉన్న ఈ స్టేడియంలో దాదాపు 15వేల టికెట్ల వరకు స్పాన్సర్లు, బీసీసీఐ, ఇతర రాష్ట్రాల క్రికెట్ బోర్డులకు కేటాయిస్తారు. అయితే మిగిలిన 21వేల టికెట్ల అమ్మకంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) పారదర్శకత పాటించడం లేదని అభిమానులు మండిపడుతున్నారు. ఇందులో కూడా కామన్ టికెట్లనే బ్లాక్ చేశారని.. ఎక్కువ ధర టికెట్లను మాత్రమే అమ్మారని.. ప్రస్తుతం అవి కూడా దొరకని పరిస్థితికి అధికారులు తీసుకొచ్చారని ఫ్యాన్స్ వాపోయారు. అనుకోకుండా అందివచ్చిన అవకాశాన్ని క్యాష్ చేసుకోవాలని హెచ్‌సీఏ చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగ రేపు ఐపీఎల్ ఫైనల్లో భాగంగా డిపెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో మాజా చాంపియన్ ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం పటిష్ట భద్రతను ఏర్పాటు చేసామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. -
కట్టప్పా... టికెట్లు ఎక్కడప్పా !
♦ బ్లాక్‌లో ‘బాహుబలి–2’ టికెట్లు ♦ ఇద్దరు ప్రజాప్రతినిధులే సూత్రధారులు ♦ తొలి వారంలో రూ.300కోట్ల దోపిడీకి పన్నాగం ♦ థియేటర్ల వద్ద టికెట్లు నిల్... బ్లాక్‌లో ఫుల్ ♦ చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం సాక్షి, అమరావతిబ్యూరో : ‘బాహుబలి–2’ బ్లాక్ టికెట్ల దందా బాక్సాఫీస్ రికార్డు బద్దలు కొడుతోంది. అధికారిక కలెక్షన్ల సంగతేమో గానీ... విజయవాడకు చెందిన ఇద్దరు టీడీపీ ప్రజాప్రతినిధుల బ్లాక్ దందాలో మాత్రం కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ‘బాహుబలి–2’పై వ్యామోహాన్ని సొమ్ము చేసుకునేందుకు ప్రభుత్వ పెద్దల సన్నిహిత నిర్మాత ఒకరు రంగంలోకి దిగారు. అమరావతి పరిధిలో బ్లాక్ టికెట్ల దందా బాధ్యతను ఆయన విజయవాడకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులకు అప్పగించారు. వీరిద్దరూ దశాబ్దాల క్రితం బ్లాక్ టికెట్ దందాలో సన్నిహితంగా మెలిగిన వారే కావడం విశేషం. వీరిలోఒకరు ప్రస్తుతం వివాదాస్పద రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. మరొకరు కాల్‌మనీ రాకెట్‌కు సూత్రధారిగా ఉన్నారు. బ్లాక్ టికెట్ల దందా గురించి పూర్తిగా తెలిసిన ఇద్దరు నేతలు మళ్లీ ‘బాహుబలి–2’తో జూలువిదిల్చారు. తమ వర్గీయుల ద్వారా టికెట్ల ధరలను అమాంతం పెంచేసి బ్లాక్ దందాకు తెగించారు. అమరావతి ఆ ఇద్దరిదే... ఆకాశాన్ని తాకుతున్న ‘బాహుబలి–2’ వ్యామోహం విజయవాడలోని ఇద్దరు ప్రజాప్రతినిధులకు తమ గతం గుర్తుకు వచ్చింది. వెంటనే కలిసి కట్టుగా రంగంలోకి దిగారు. అయితే అప్పటికే అమరావతితోపాటు వైజాగ్, సీడెడ్, కర్ణాటకలోని అన్ని థియేటర్లను ప్రభుత్వ పెద్దల సన్నిహితుడైన ఒక నిర్మాత తన గుప్పెట్లో పెట్టుకున్నారు. ఆయన్ను కలిసి అమరావతి పరిధిలోని థియేటర్లను తమకు విడిచిపెట్టాలని విజయవాడకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు మంతనాలు జరిపారు. మరోవైపు మూడు, నాలుగు ప్రాంతాల్లో టికెట్ల విక్రయాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించడం కష్టమని ఆ నిర్మాత భావించారు. అందుకే అమరావతి వరకు 50:50 నిష్పత్తిలో బ్లాక్ టికెట్ల దందాను పంచుకునేలా వారిద్దరితో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం. ఒక్కో టికెట్ రూ.2వేల నుంచి రూ.3వేలు! ఇద్దరు ప్రజాప్రతినిధులు స్వయంగా రంగంలోకి దిగడంతో ‘బాహుబలి’ టికెట్ బ్లాక్ మార్కెట్ దందాకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. తమకు అమరావతిలో బ్లాక్ దందా అప్పగించిన నిర్మాతతో కుదిరిన ఒప్పందానికి మించి టికెట్ల రేట్లు పెంచేయడం గమనార్హం. అధికారిక టికెట్ రేట్లతో నిమిత్తం లేకుండా అమరావతి పరిధిలోని 335 స్క్రీన్లలో రెండు దశల్లో బ్లాక్ దందా చేస్తున్నారు. మొదటి దశలో గురువారం రాత్రి రెండు బెనిఫిట్ షోలతోపాటు శుక్ర, శని, ఆదివారాల్లో అన్ని షోల టికెట్ల ధరను అమాంతం పెంచేశారు. బెనిఫిట్ షో టికెట్ ధరను సాధారణ థియేటర్లలో రూ.వెయ్యి నుంచి రూ.1,500 చొప్పున నిర్ణయించారు. మల్టీ ఫ్లెక్స్‌లలో రూ.2వేల నుంచి రూ.3వేల చొప్పున విక్రయించారు. ఇక శుక్ర, శని, ఆదివారాలకు సంబంధించి సాధారణ థియేటర్లలో ఒక్కో టికెట్ ధర రూ.500 నుంచి రూ.వెయ్యి, మల్టీప్లెక్స్‌లలో రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు నిర్ణయించారు. రెండో దశ టికెట్లు రేపటి నుంచి విక్రయం ! రెండో దశలో సోమవారం నుంచి వచ్చే ఆదివారం వరకు టికెట్లు బ్లాక్ చేశారు. వాటి విక్రయాలు శనివారం నుంచి ప్రారంభిస్తారని తెలుస్తోంది. మొదటి రెండురోజుల్లో సినిమాపై క్రేజ్‌ను అంచనా వేసి అప్పుడు టికెట్ ధరలు నిర్ణయించాలని భావిస్తున్నారు. మొదటి దశలో నిర్ణయించిన రేట్లకు తగ్గకుండా చూడాలన్నది వారి వ్యూహమని తెలిసింది. అమరావతి పరిధిలో మొదటి వారంలో రూ.241.50కోట్లు బ్లాక్ దందాలో కొల్లగొట్టాలని భావిస్తున్నారు. సదరు నిర్మాతతో కుదిరిన ఒప్పందం మేరకు అనుకున్న బ్లాక్ టికెట్ల రేట్లను ఈ ఇద్దరు ప్రజాప్రతినిధులు మరో 25శాతం పెంచారు. తద్వారా మరో రూ.60కోట్లు అదనంగా జేబుల్లో వేసుకోవాలన్నది వారి పన్నాగం. పత్తాలేని అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధుల అండతో దాదాపు అన్ని టికెట్లు బ్లాక్‌లోనే విక్రయిస్తున్నారు. థియేటర్ల వద్ద లైనులో నిలుచున్న ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. ఆన్‌లైన్‌లోనూ టికెట్లు అందుబాటులో లేకుండాపోయాయి. థియేటర్ల వద్దే ప్రజాప్రతినిధుల అనుచర బృందాలు దర్జాగా బ్లాక్‌లో టికెట్లు విక్రయిస్తుండటం గమనార్హం. పోలీసులు అటువైపు కన్నెత్తి చూడటమే లేదు. విజయవాడ, గుంటూరులలో కొన్ని విద్యార్థి సంఘాలు ఆందోళన చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. క్రిమినల్ కేసులు బుక్ చేయండి : కలెక్టర్ విజయవాడ : బాహుబలి–2 సినిమా టికెట్లను బ్లాక్‌లో విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బి. లక్ష్మీకాంతం గురువారం రాత్రి అధికారులను ఆదేశించారు. బ్లాకులో టికెట్లు విక్రయించే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని జిల్లాలోని రెవెన్యూ, పోలీసు అధికారులకు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. యాజమాన్యాలు తప్పు చేస్తే థియేటర్లను కూడా సీజ్ చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సినిమాటోగ్రఫీ యాక్ట్ సెక్షన్–9 ప్రకారం కేసులు నమోదు చేయాలని, ఎవరినీ ఉపేక్షించ వద్దని కలెక్టర్ సూచించారు.