మీడియాతో మాట్లాడుతున్న మంత్రి పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్.. వాళ్ల వాళ్ల జీవితాల్లో రాజకీయాలకు వాడుకోని వస్తువు అంటూ ఏదీలేదని ఏకీపారేశారు ఏపీ సమాచారశాఖ మంత్రి పేర్ని నాని. శుక్రవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి నాని.. పవన్ కల్యాణ్ కొత్త సినిమా విషయంలో ప్రతిపక్షం చేస్తున్న రాద్ధాంతంపై స్పందించారు.
‘‘ప్రతిపక్ష నేత చంద్రబాబు అనుభవం ఏపాటిదో ఇప్పుడు అర్ధమవుతోంది. ఒక సినిమా రిలీజ్ ఉంటే దానికోసం ఈ తండ్రీకొడుకులు పిల్లి మొగ్గలు వేస్తున్నారు. పవన్ కల్యాణ్ సినిమాని మేం(ప్రభుత్వం) తొక్కడం ఏమిటి?. ఎన్టీఆర్, హరికృష్ణలను మీరూ చేసింది తొక్కడమంటే!. పవన్ సినిమా చూడమంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. టీడీపీ జెండా మోసిన జూ. ఎన్టీఆర్‌ను ఎప్పుడైనా పట్టించుకున్నారా? అంటూ పేర్ని నాని, నారా లోకేష్‌ను నిలదీశారు. జూ. ఎన్టీఆర్ సినిమాను చంద్రబాబు ఒక్కసారైనా ప్రశంసించారా? జూనియర్ ఎన్టీఆర్ సినిమా వచ్చినప్పుడు మీరు ఇలా ఎప్పుడైనా తహతహలాడారా?. కుప్పంలో వన్ సైడ్ లవ్ ఉండదు అన్నావు? ఇదేమి లవ్...ఏ సైడ్ లవ్?. పవన్ కళ్యాణ్ గురించి మేము ఎప్పుడు పట్టించుకున్నాం? అంటూ చంద్రబాబు, లోకేష్‌పై విసుర్లు విసిరారు మంత్రి నాని.
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పేర్ని నాని
చంద్రబాబు ప్రతి వ్యవస్థను దిగజరిస్తే వాటిని మేము గాడిలో పెడుతున్నాం. అలాంటి మాపై దిగజారుడు మాట్లాడుతున్నారు. బ్లాక్ లో టికెట్స్ అమ్ముకోడానికి, వ్యవస్థ దెబ్బతినడానికి చంద్రబాబు కారణం. బ్లాకులో టికెట్లు అమ్ముతుంటే చూస్తూ ఉండాలా? ప్రభుత్వం నిర్దేశించిన రేటు కాకుండా వేరే రేటు అంటే చట్టాన్నే కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా?. ధరలపై ఎగ్జిబిటర్లు కోర్టుకు వెళ్లారు. ప్రభుత్వంతో సంప్రదించి ధరలను నిర్ణయించుకోండి అని చెప్పారు. సినిమా పెద్దలు వచ్చారు.. జీవో ఇస్తామన్నారు.. ఇప్పుడు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు.
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పేర్ని నాని
గౌతమ్‌రెడ్డి మృతితో జీవో ఆలస్యం
చట్టాన్ని గౌరవించే పెద్ద మనసు మీకు లేదు. చంద్రబాబు గతంలో మీరు నిజంగా ప్రభుత్వం నడిపారా?. ఇంతకంటే దిగజారే పరిస్థితి లేదు అనుకున్నప్పుడల్లా మరో మెట్టు దిగుతున్నాడు. బ్లాక్ లో టికెట్లు అమ్మాలని ఆందోళన చేయడం ఏమిటి?. ఎప్పుడన్నా మహేష్, చిరంజీవి సినిమాలకి ఇలా ట్వీట్ చేశారా?. మొన్ననే కమిటీ కూర్చుంది. 24నే జీవో రావాల్సి ఉంది. కానీ, గౌతమ్‌రెడ్డి మృతితో ఆలస్యమైంది అంతే. జీవో రావడం రెండు రోజులు ఆలస్యమైతే రచ్చ చేస్తున్నారు. సొంత బావమరిది శవం పక్కన రాజకీయాలు మాట్లాడింది ఎవరు?. గౌతమ్ రెడ్డి మరణిస్తే పరుగెత్తుకొచ్చి దండెసి రెండో రోజే ఆయనపై మాట్లాడిస్తాడు. మనిషి విలువ, మరణిస్తే వచ్చే బాధ చంద్రబాబుకి తెలియదు. ఈ ప్రభుత్వం ఒక ఆప్తుడ్ని కోల్పోయి బాధలో ఉంటే జీవో ఇవ్వలేదంటాడు. దీన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నాడు.
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పేర్ని నాని
అఖండ సినిమా రిలీజ్ ముందు ప్రొడ్యూసర్స్ ఎమ్మెల్యే మేకా ప్రతాప అప్పారావు ద్వారా కలవడానికి ప్రయత్నం చేశారు. రమ్మంటే రెండు మూడు డేట్లు ఇవ్వాలన్నారు వాళ్ళు. విజయవాడ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో నన్ను కలవలేదా...? బాలకృష్ణ గారు నాతో మాట్లాడారు...నేను సీఎం గారితో మాట్లాడాను. ఆయన రానవసరం లేదు...పెద్దరికం పోతుంది అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఆయనకి ఏమి కావాలో చేసి పెట్టండి అని చెప్పారు. బాలకృష్ణ వ్యతిరేకంగా అలా మాట్లాడి ఉంటారని నేనైతే అనుకోవడం లేదు.
సినిమా ఉచితంగా చూపిస్తాను అన్నాయనకు ఇవన్నీ ఎందుకు?. ప్రీరిలీజ్ ఫంక్షన్ ఒక రోజు పోస్ట్‌పోన్ చేసుకున్న వాళ్ళు.. సినిమా మరో రెండు రోజులు వాయిదా వేసుకోవచ్చుగా. ఆ హీరోగారు మైకు పట్టుకుంటే నీతులు చెప్తాడు...మరి ఈ నీతి మాలిన పనులేంటి..? సినిమా బాగుంటే జనం చూస్తారు. పుష్ప చూళ్ళేదా...? నాగార్జున కొడుకు సినిమా వచ్చింది చూసారుగా. అత్తారింటికి దారేది బాగుంది జనం చూసారు. అసలు సినిమాకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏముంది? అని పేర్కొన్నారు మంత్రి. దేశంలో బ్లాక్ మార్కెట్ ను పార్టీలు టీడీపీ, ఏపీ బీజేపీ లే ప్రొత్సహిస్తున్నాయని, బ్లాక్ లో టికెట్లు అమ్మితే తప్పు అని చెప్పాల్సిన వారు.. అదొక హక్కుగా చిత్రీకరిస్తున్నారని మంత్రి పేర్ని నాని ఆవేదన వ్యక్తం చేశారు. వీళ్లంతా ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై ఎంత వ్యతిరేకతతో ఉన్నారో అర్థం అవుతుందన్నారు ఆయన.
Comments
Please login to add a commentAdd a comment