కట్టప్పా... టికెట్లు ఎక్కడప్పా ! | Kattappa Baahubali 2 ? | Sakshi
Sakshi News home page

కట్టప్పా... టికెట్లు ఎక్కడప్పా !

Published Fri, Apr 28 2017 10:46 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

కట్టప్పా... టికెట్లు ఎక్కడప్పా ! - Sakshi

కట్టప్పా... టికెట్లు ఎక్కడప్పా !

♦  బ్లాక్‌లో ‘బాహుబలి–2’ టికెట్లు
ఇద్దరు ప్రజాప్రతినిధులే సూత్రధారులు
తొలి వారంలో రూ.300కోట్ల దోపిడీకి పన్నాగం
థియేటర్ల వద్ద టికెట్లు నిల్‌... బ్లాక్‌లో ఫుల్‌
చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం


సాక్షి, అమరావతిబ్యూరో : ‘బాహుబలి–2’ బ్లాక్‌ టికెట్ల దందా బాక్సాఫీస్‌ రికార్డు బద్దలు కొడుతోంది. అధికారిక కలెక్షన్ల సంగతేమో గానీ... విజయవాడకు చెందిన ఇద్దరు టీడీపీ ప్రజాప్రతినిధుల బ్లాక్‌ దందాలో మాత్రం కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ‘బాహుబలి–2’పై వ్యామోహాన్ని సొమ్ము చేసుకునేందుకు ప్రభుత్వ పెద్దల సన్నిహిత నిర్మాత ఒకరు రంగంలోకి దిగారు. అమరావతి పరిధిలో బ్లాక్‌ టికెట్ల దందా బాధ్యతను ఆయన విజయవాడకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులకు అప్పగించారు. వీరిద్దరూ దశాబ్దాల క్రితం బ్లాక్‌ టికెట్‌ దందాలో సన్నిహితంగా మెలిగిన వారే కావడం విశేషం. వీరిలోఒకరు ప్రస్తుతం వివాదాస్పద రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. మరొకరు కాల్‌మనీ రాకెట్‌కు సూత్రధారిగా ఉన్నారు. బ్లాక్‌ టికెట్ల దందా గురించి పూర్తిగా తెలిసిన ఇద్దరు నేతలు మళ్లీ ‘బాహుబలి–2’తో జూలువిదిల్చారు. తమ వర్గీయుల ద్వారా టికెట్ల ధరలను అమాంతం  పెంచేసి బ్లాక్‌ దందాకు తెగించారు.

అమరావతి ఆ ఇద్దరిదే...
ఆకాశాన్ని తాకుతున్న ‘బాహుబలి–2’ వ్యామోహం విజయవాడలోని ఇద్దరు ప్రజాప్రతినిధులకు తమ గతం గుర్తుకు వచ్చింది. వెంటనే కలిసి కట్టుగా రంగంలోకి దిగారు. అయితే అప్పటికే అమరావతితోపాటు వైజాగ్, సీడెడ్, కర్ణాటకలోని అన్ని థియేటర్లను ప్రభుత్వ పెద్దల సన్నిహితుడైన ఒక నిర్మాత తన గుప్పెట్లో పెట్టుకున్నారు. ఆయన్ను కలిసి అమరావతి పరిధిలోని థియేటర్లను తమకు విడిచిపెట్టాలని విజయవాడకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు మంతనాలు జరిపారు. మరోవైపు మూడు, నాలుగు ప్రాంతాల్లో టికెట్ల విక్రయాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించడం కష్టమని ఆ నిర్మాత భావించారు. అందుకే అమరావతి వరకు 50:50 నిష్పత్తిలో బ్లాక్‌ టికెట్ల దందాను పంచుకునేలా వారిద్దరితో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం.  

ఒక్కో టికెట్‌ రూ.2వేల నుంచి రూ.3వేలు!
ఇద్దరు ప్రజాప్రతినిధులు స్వయంగా రంగంలోకి దిగడంతో ‘బాహుబలి’ టికెట్‌ బ్లాక్‌ మార్కెట్‌ దందాకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. తమకు అమరావతిలో బ్లాక్‌ దందా అప్పగించిన నిర్మాతతో కుదిరిన ఒప్పందానికి మించి టికెట్ల రేట్లు పెంచేయడం గమనార్హం. అధికారిక టికెట్‌ రేట్లతో నిమిత్తం లేకుండా అమరావతి పరిధిలోని 335 స్క్రీన్లలో  రెండు దశల్లో బ్లాక్‌ దందా చేస్తున్నారు. మొదటి దశలో గురువారం రాత్రి రెండు బెనిఫిట్‌ షోలతోపాటు శుక్ర, శని, ఆదివారాల్లో అన్ని షోల టికెట్ల ధరను అమాంతం పెంచేశారు. బెనిఫిట్‌ షో టికెట్‌ ధరను సాధారణ థియేటర్లలో రూ.వెయ్యి నుంచి రూ.1,500 చొప్పున నిర్ణయించారు. మల్టీ ఫ్లెక్స్‌లలో రూ.2వేల నుంచి రూ.3వేల చొప్పున విక్రయించారు. ఇక శుక్ర, శని, ఆదివారాలకు సంబంధించి సాధారణ థియేటర్లలో ఒక్కో టికెట్‌ ధర రూ.500 నుంచి రూ.వెయ్యి, మల్టీప్లెక్స్‌లలో రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు నిర్ణయించారు.


రెండో దశ టికెట్లు రేపటి నుంచి విక్రయం !
రెండో దశలో సోమవారం నుంచి వచ్చే ఆదివారం వరకు టికెట్లు బ్లాక్‌ చేశారు. వాటి విక్రయాలు శనివారం నుంచి ప్రారంభిస్తారని తెలుస్తోంది. మొదటి రెండురోజుల్లో సినిమాపై క్రేజ్‌ను అంచనా వేసి అప్పుడు టికెట్‌ ధరలు నిర్ణయించాలని భావిస్తున్నారు. మొదటి దశలో నిర్ణయించిన రేట్లకు తగ్గకుండా చూడాలన్నది వారి వ్యూహమని తెలిసింది. అమరావతి పరిధిలో మొదటి వారంలో రూ.241.50కోట్లు బ్లాక్‌ దందాలో కొల్లగొట్టాలని భావిస్తున్నారు. సదరు నిర్మాతతో కుదిరిన ఒప్పందం మేరకు అనుకున్న బ్లాక్‌ టికెట్ల రేట్లను ఈ ఇద్దరు ప్రజాప్రతినిధులు మరో 25శాతం పెంచారు. తద్వారా మరో రూ.60కోట్లు అదనంగా జేబుల్లో వేసుకోవాలన్నది వారి పన్నాగం.

పత్తాలేని అధికార యంత్రాంగం
ప్రజాప్రతినిధుల అండతో దాదాపు అన్ని టికెట్లు బ్లాక్‌లోనే విక్రయిస్తున్నారు. థియేటర్ల వద్ద లైనులో నిలుచున్న ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. ఆన్‌లైన్‌లోనూ టికెట్లు అందుబాటులో లేకుండాపోయాయి. థియేటర్ల వద్దే ప్రజాప్రతినిధుల అనుచర బృందాలు దర్జాగా బ్లాక్‌లో టికెట్లు విక్రయిస్తుండటం గమనార్హం. పోలీసులు అటువైపు కన్నెత్తి చూడటమే లేదు. విజయవాడ, గుంటూరులలో కొన్ని విద్యార్థి సంఘాలు ఆందోళన చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.  

క్రిమినల్‌ కేసులు బుక్‌ చేయండి : కలెక్టర్‌
విజయవాడ : బాహుబలి–2 సినిమా టికెట్లను బ్లాక్‌లో విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ బి. లక్ష్మీకాంతం గురువారం రాత్రి అధికారులను ఆదేశించారు. బ్లాకులో టికెట్లు విక్రయించే వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని జిల్లాలోని రెవెన్యూ, పోలీసు అధికారులకు కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. యాజమాన్యాలు తప్పు చేస్తే థియేటర్లను కూడా సీజ్‌ చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సినిమాటోగ్రఫీ యాక్ట్‌ సెక్షన్‌–9 ప్రకారం కేసులు నమోదు చేయాలని, ఎవరినీ ఉపేక్షించ వద్దని కలెక్టర్‌ సూచించారు.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement