భారత్ మార్కెట్లోకి బ్లాక్‌బెర్రీ పాస్‌పోర్ట్
న్యూఢిల్లీ: బ్లాక్‌బెర్రీ కంపెనీ తన అత్యంత ఖరీదైన మొబైల్ ఫోన్ ‘బ్లాక్‌బెర్రీ పాస్‌పోర్ట్’ను సోమవారం భారత మార్కెట్లోకి ఆవిష్కరించింది. వచ్చే నెల 10 నుంచి విక్రయాలు ప్రారంభమయ్యే ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.49,990 అని బ్లాక్‌బెర్రీ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ సునిల్ లాల్వాణి చెప్పారు. అమెజాన్డాట్ఇన్లోనూ, బ్లాక్‌బెర్రీ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్‌లోనూ ముందస్తు బుకింగ్స్ సోమవారం నుంచే ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. అమెజాన్‌డాట్‌ఇన్‌లో బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు రూ.5,000 గిఫ్ట్‌కార్డ్ లభిస్తుందని వివరించారు
3 వరుసల క్వెర్టీ కీ ప్యాడ్
ఈ ఫోన్లో 4.5 అంగుళాల ఎల్సీడీ టచ్ స్క్రీన్ ఉంది. మూడు వరుసల క్వెర్టీ కీ ప్యాడ్, కెపాసిటివ్ టచ్ ఫీచర్స్ కూడా ఈ ఫోన్లో ఉన్నాయి. ఈ కీప్యాడ్ టైపింగ్‌కు, వేళ్లతో తాకడం ద్వారా నావిగేషన్‌కు ఉపయోగపడుతుందని వివరించారు.
ఈ ఫోన్లో 3,450 ఎంఏహెచ్ బ్యాటరీ (తొలగించటానికి వీలులేని)ఉందని, 2జీ నెట్‌వర్క్‌లో 14 గంటల టాక్‌టైమ్‌ను సపోర్ట్ చేస్తుందని, 11 గంటల వీడియో ప్లేబ్యాక్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ చతురస్రాకార మొబైల్లో 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 32 జీబీ ఇంటర్న ల్ మెమరీ, 128 జీబీ ఎక్స్టర్నల్ మెమరీ వంటి ప్రత్యేకలున్నాయని చెప్పారు. అత్యుత్తమ నాణ్యత గల విడిభాగాలు, స్పెసిఫికేషన్స్‌తో దీన్ని రూపొందించాన్నారు.