తవ్వకాల్లో 800 మంది చిన్నారుల మృతదేహాలు
లండన్ పురావస్తుశాఖ జరిపిన తవ్వకాల్లో విస్మయకర విషయాలు బయటపడుతున్నాయి. తవ్వకాల్లో ఒకటి కాదు...రెండు కాదు.. ఏకంగా 800 మంది చిన్నారుల మృత దేహాలు బయట పడ్డాయి. ప్రస్తుతం బ్లాక్ బర్న్ పట్టణంలో వెలుగు చూసిన అస్థిపంజరాలను పరిశీలించి అక్కడి ప్రజల జీవన పరిమాణాలపై అధ్యయనాలు చేపట్టిన ఆ శాఖ ఎన్నో విషయాలను వెల్లడించింది. ఒకప్పుడు ఆ ప్రాంతం పారిశ్రామిక వాడగా ఉండేదని, అక్కడి ప్రజలు... ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా ఊపిరితుత్తుల సమస్యలతో మరణించినట్లు సర్వే చెప్తోంది.
లండన్ లాంక్ షైర్ లోని బ్లాక్ బర్న్ పట్టణంలో రహదారి నిర్మాణం కోసం పురావస్తు శాఖ చేపట్టిన తవ్వకాల్లో 800 మంది చిన్నారుల మృత దేహాలు బయట పడటం ఇప్పుడు అందరికీ విస్మయం కలిగిస్తోంది. 1821 లో సెయింట్ పీటర్స్ శ్మశాన వాటికగా ఉండే ఈ ప్రాంతంలో మొత్తం 1,967 మృత దేహాలను వెలికి తీశారు. వీరిలో ఎక్కువ శాతం చిన్నారుల మృత దేహాలు ఉండటమే కాదు... వీరంతా ఆరేళ్ళ లోపు వయసువారే అయి ఉండటం విశేషం. పారిశుద్ధ్య లోపం, మందులు లేకపోవడంతోనే కాక, అధికశాతం ఇన్ఫెక్షన్లతో కూడ వీరంతా చనిపోయినట్లు శాస్త్రవేత్తలు ఓ అంచనాకు వచ్చారు. 1860 నాటికి ఈ స్మశాన వాటిక అత్యధిక వినియోగంతో 30 శాతం శరీరాలను అప్పట్లోనే సమాధులనుంచి బయటకు తీసినట్లు బ్లాక్బర్న్ ప్రతినిధి దార్వెన్... బోరో కౌన్సిల్ కు తెలిపారు.
అస్థిపంజరాలపై పూర్తి విశ్లేషణ ప్రారంభించామని, బయటకు తీసిన పిల్లల మరణాలు ఎక్కువ శాతం ఊపిరితిత్తుల సమస్యలతోనే సంభవించినట్లు తెలుస్తోందని హెడ్ ల్యాండ్ ఆర్కియాలజీ కి చెందిన ఎముకల అధ్యయన నిపుణుడు డేవ్ హెండర్సన్ చెప్పారు. అయితే వారంతా చిన్నవయసులోనే మరణించడం వల్ల అస్థిపంజరాల ద్వారా ఎక్కువ వివరాలు తెలియడం లేదన్నారు. పారిశ్రామిక మిల్లులకు కేంద్రమైన ఆ పట్టణంలో జనాభా అతి వేగంగా అభివృద్ధి చెందడంతోనే అప్పట్లో ఆ ప్రాంతం ఎంతో రద్దీగా ఉండేదని, దీంతో అక్కడివారికి కాలుష్యం కారణంగా ఇన్ఫెక్షన్ల సమస్య వచ్చి ఉండొచ్చని ఊహిస్తున్నారు. లండన్ వెలుపల సాధారణ ప్రజల జీవితాలపై ఇంతకు ముందే భారీ అధ్యయనాలు జరిగాయని దానికి కొనసాగింపుగానే ఇప్పుడు ఈ అధ్యయనాలు చేపడుతున్నట్లు నిపుణులు చెప్తున్నారు. ఇక్కడ చనిపోయినవారి స్మారకార్థం ఏర్పాటు చేసిన శిలాఫలాకాల్లో సుమారు 176 ఫలకాలను పరిశీలించగా... వీటిపై ఉన్న వివరాలను బట్టి ఇక్కడివారిలో ఎక్కువశాతం మంది అమ్మాయిలు ఎలిజబెత్, మేరీ.... అబ్బాయిలు థామస్, జాన్ పేర్లు కలిగి ఉన్నట్లు తెలిసింది.
ఈ తవ్వకాల్లో బయటపడిన సుమారు 16 నాణేలు కూడ ఆ కాలంలో చెలామణిలో ఉన్నట్లు తెలుస్తోంది. సమాధుల్లోని ఓ శరీరం వివరాలను బట్టి అతడు క్రిమీన్ వార్ లో గాయపడి చనిపోయినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇక్కడ పూడ్చిపెట్టిన పిల్లల చేతులు, కాళ్ళకు అప్పట్లో చౌకగా లభించే ఇత్తడి, గాజు ఆభరణాలు ఉన్నాయని పురావస్తు మేనేజర్ జూలీ ఫ్రాంక్లిన్ తెలిపారు. 1945 వరకూ కూడ ఈ శ్మశాన వాటికలో కొందరు కుటుంబాలకోసం ముందే స్థలాన్ని కొనుగోలు చేసినట్లు వివరాలను బట్టి తెలుస్తోంది. 1500 మంది కూర్చునేందుకు వీలుగా ఉండే ఇక్కడి సెయింట్ పీటర్స్ చర్చ్ 20 వ శతాబ్ద కాలంలో శిథిలావస్థకు చేరింది. దీంతో 1976 ప్రాంతంలో దీన్నినేలమట్టం చేశారు. అయితే ఈ వేసవి నాటికి స్మారక సేవను తిరిగి ప్రారంభిస్తామని, అప్పటివరకూ శవ ఖననాలు శ్మశానవాటికలోని మరోభాగంలో జరుగుతాయని బ్లాక్బర్న్ బిషప్ చెప్తున్నారు. ప్రస్తుతం ఫ్రెక్లెటన్ స్ట్రీట్ లింక్ రోడ్ నిర్మాణం కోసం కౌన్సిల్ అధికారి ఆధ్వర్యంలో పురావస్తు తవ్వకాల్లో భాగంగా ఈ పరిశోధనలు నిర్వహిస్తున్నారు.