ముద్రగడను విమర్శించే అర్హత ఎవరికీ లేదు
స్థాయి మరిచి మాట్లాడితే జాతి చూస్తూ ఊరుకోదు
సత్రం భూములు కాజేసిన చరిత్ర మీది
కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయకు కాపు జేఏసీ హెచ్చరిక
కిర్లంపూడి : మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను విమర్శించే అర్హత రాష్ట్రంలో ఏ ఒక్కరికీ లేదని కాపు జేఏసీ నాయకులు సృష్టం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో మచ్చలేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ముద్రగడ ఒక్కరేనని వారన్నారు. కిర్లంపూడిలోని ముద్రగడ నివాసంలో జేఏసీ నాయకుల సమావేశం బుధవారం సాయంత్రం జరిగింది. కాపు సద్భావనా సంఘం జిల్లా అధ్యక్షుడు వాసిరెడ్డి ఏసుదాసు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు, తోట రాజీవ్, కల్వకొలను తాతాజీ, గౌతు స్వామి, బోడసకుర్రు దత్తుడు తదితరులు మాట్లాడారు. ముద్రగడపై కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ అవాకులు, చెవాకులు పేలడాన్ని తీవ్రంగా ఖండించారు. సత్రం భూములు కాజేసిన చరిత్ర ఆయనదని, స్థాయి మరిచి మాట్లాడితే జాతి చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. జాతి కోసం 1994లో ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి కుటుంబ సమేతంగా ప్రాణ త్యాగానికి సిద్ధపడి కాపుల కోసం జీఓ నంబర్ 30 సాధించిన ఘనత ముద్రగడదని గుర్తు చేశారు. యావత్తు కాపు జాతీ ముద్రగడ వెంటే ఉంటుందన్నారు. దొంగ దీక్షలు చే యాల్సిన అవసరం ముద్రగడకు లేదన్నారు. ప్రభుత్వం నిర్బంధించినా 14 రోజుల పాటు ఏ విధంగా దీక్ష చేశారో కాపు జాతికే కాకుండా యావత్తు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. దొంగ హామీ లిచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. ముద్రగడ ఉద్యమం చేట్టకపోతే కాపు కార్పొరేషన్ లేదు, రామానుజయకు ఆ పదవీ రాదన్నారు.