జీఎస్టీపై విదేశీ మీడియా ఏమంటోంది?
దేశమంతటిన్నీ ఒకే పన్ను విధానంలోకి తీసుకొస్తూ జూలై 1 నుంచి జీఎస్టీ అమలు చేయాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. జీఎస్టీకి అనుబంధమైన నాలుగు బిల్లులను లోక్ సభలో ప్రవేశపెట్టిన కేంద్రం, నేడు వాటిని చర్చకు తీసుకొచ్చింది. ఈ ప్రక్రియ ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు భారత్ కు జీఎస్టీ అమలు చేయడం చాలా కఠినమైన పరీక్ష అని విదేశీ మీడియా వ్యాఖ్యానించింది. ''పన్నుల విషయంలో ఇది భారీ మార్పు. కేంద్ర, రాష్ట్రాల పాలనలో మార్పు చోటుచేసుకుంటుంది. చాలా ప్రక్రియలు, విధానాలను, కొత్త వాటిని అమలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీని అమలుచేయడం అతిపెద్ద సవాలే'' అని ప్రధాని మోదీకి చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్ గా ఉన్న అరవింద్ సుబ్రహ్మణ్యన్ బ్లూమ్ బర్గ్ టెలివిజన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
కానీ ఇదంతా తాత్కాలికమేనని, తొలుత ఇది రోడ్డుమీద గుంతలు లాగా ఉంటుందని అభివర్ణించారు. ఈ ఇంటర్వ్యూ అనంతరం భారత్ కు జీఎస్టీ అమలు చాలా కఠినమైన పరీక్షేనని విదేశీ మీడియా పేర్కొంది. సుబ్రహ్మణ్యన్ చేసిన ఈ కామెంట్ల అనంతరం కొన్ని గంటల్లోనే జీఎస్టీ ప్రక్రియ తుదిరూపంపై బిల్లులు లోక్ సభలో చర్చకు వచ్చాయి. ఏప్రిల్ 12తో ముగియనున్న పార్లమెంట్ సమావేశాల లోపల ఇది ఆమోదం పొందాల్సి ఉంటుంది. అప్పుడైతేనే అనుకున్న సమయం జూలై 1 నుంచి దీన్ని అమలుచేయనున్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన అతిపెద్ద ఆర్థికవ్యవస్థను ఒకే మార్కెట్లోకి తీసుకురావాలని ఏకీకృత పన్నుల విధానం జీఎస్టీని అమలుచేయబోతున్నారు.