'పీఎం, సీఎం నివాసాలను పేల్చివేస్తాం'
న్యూఢిల్లీ: ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి వచ్చిన బెదిరింపు కాల్ ఢిల్లీలో కలకలం సృష్టించింది. భద్రత బలగాలను ఉరుకులు, పరుగులు పెట్టించింది. ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసాలలో బాంబులు పెట్టామని, పేల్చివేస్తామంటూ శనివారం మధ్యాహ్నం జాతీయ దర్యాప్తు సంస్థ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ వచ్చింది. ఎన్ఐఏ అధికారులు వెంటనే పోలీసులను అప్రమత్తం చేశారు.
రేస్ కోర్సు రోడ్డులోని ప్రధాని మోదీ అధికార నివాసం 7 బంగ్లాకు, సివిల్ లైన్స్‌లో ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డులోని కేజ్రీవాల్ నివాసానికి భద్రత బలగాలు, బాంబు డిస్పోజల్ బృందాలు చేరుకుని అణువణువూ గాలించాయి. అయితే ఎలాంటి పేలుడు పదార్థాలూ లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ సర్వీస్ ద్వారా బెదిరింపు ఫోన్ కాల్ చేసినట్టు గుర్తించారు. నిందితుడిని గుర్తించేందుకు అధికారులు విచారణ చేస్తున్నారు. వారం రోజుల క్రితం ఓ వ్యక్తి ఇలాగే ఫోన్ చేసి రాష్ట్రపతి భవన్, ఢిల్లీలోని ఇతర ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్టు బెదిరించాడు.