బ్లూ వేల్ లింకులను వెంటనే తొలగించండి
న్యూఢిల్లీ: మృత్యుక్రీడగా ఘటికలు మోగిస్తున్న డేంజర్ గేమ్ బ్లూ వేల్ ఛాలెంజ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఓ అడుగు వేసింది. తక్షణమే ఈ ఆటకు సంబంధించిన లింకులను తీసేయాలంటూ సోషల్ మీడియా దిగ్గజాలకు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశాలను జారీచేసింది.
ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లతోపాటు మైక్రోసాప్ట్ మరియు యాహూలు ఉత్తర్వులు అందుకున్న వాటిలో ఉన్నాయి. " బ్లూ వేల్ ఆటకి బానిసలై పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. సోషల్ మీడియా అందుకు వేదికగా మారటం దురదృష్టకరం. అందుకే ఆటకు సంబంధించి ఎటువంటి లింకులున్నా తొలగించండి" అని ఆ లేఖలో మంత్రిత్వశాఖ పేర్కొంది.
ఆన్లైన్ సూసైడ్ గేమ్ మూలంగా ముంబై, పశ్చిమ బెంగాల్ లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి మేనకా గాంధీ హెం శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఐటీ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ ల దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అంశాన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్రం తాజా మార్గదర్శకాలను జారీచేసినట్లు స్పష్టమౌతోంది. ఇప్పటిదాకా సుమారు 100 మంది బ్లూవేల్ భూతానికి బలైనట్లు ఓ అంచనా.