సముద్రంపై చమురుతెట్టు - ఎం హెచ్ 370 పై కొత్త ఆశలు
దక్షిణ హిందూ మహాసముద్రంలో మలేషియన్ విమానం కుప్పకూలినట్టుగా భావిస్తున్న చోట భారీ మొత్తంలో చమురు తెట్టు ఉన్నట్టు వెల్లడైంది. కుప్పకూలిన విమానం అన్వేషణలో ఈ చమురు తెట్టు ఉపయోగపడే అవకాశం ఉందని విమానం కోసం అన్వేషణ జరుపుతున్న నిపుణులు చెబుతున్నారు. వారు ఈ చమురు తెట్టు సాంపిల్స్ సేకరించారు.
మరో వైపు సముద్ర గర్భంలో విమానం శకలాలు, బ్లాక్ బాక్సును కనుగొనేందుకు ప్రత్యేక సోనార్ సెన్సర్లున్న బ్లూఫిన్ 21 జలాంతర్గామిని కూడా ప్రవేశపెట్టారు. ఇది సముద్ర గర్భంలో ఉన్న వస్తువుల వివరాలను సోనార్ మ్యాప్ సాయంతో సేకరిస్తుంది. రిమోట్ పరికరాల ద్వారా దీనిని నడిపించడానికి వీలుంటుంది. దీని ద్వారా పొందిన మ్యాపుల సాయంతో బ్లాక్ బాక్సు ఉందా లేదా అన్న విషయాన్ని కనుగొనవచ్చు.
గత ఏప్రిల్ 8 నుంచి సముద్ర గర్భం నుంచి ఎలాంటి సిగ్నల్స్ రాలేదు. దీనితో బ్లాక్ బాక్స్ బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జి అయి ఉంటుందని నిపుణులు అనుమానిస్తున్నారు. మార్చి 8 న మలేషియా రాజధాని కౌలాలంపుర్ నుంచి 239 మందితో బయలుదేరిన విమానం కొద్ది సేపటికే జాడ తెలియకుండా పోయింది. దీనితో నె లరోజుల నుంచి దీని కోసం పలు దేశాలు సంయుక్తంగా అన్వేషణ కొనసాగిస్తున్నాయి.