జెండా ఆవిష్కరణ
బీఎంఎస్ రాష్ర్ట కార్యదర్శి వెంకట్రెడ్డి
శామీర్పేట్ : కార్మికులకు 60 ఏళ్లుగా భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) అండగా ఉంటూ వస్తోందని ఆ సంఘం రాష్ర్ట కార్యదర్శి వెంకట్రెడ్డి అన్నారు. బీఎంఎస్ 60 వసంతాలు పూర్తిచేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకొని మంగళవారం జగన్గూడ పరిధిలోని రవిలీలాగ్రానెట్స్ ప్రై.లి. ఆవరణలో జెండా ఆవిష్కరించారు. అనంతరం కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 23న నిర్వహించే ‘చలో హైదరాబాద్’ కార్మిక మహాప్రదర్శన వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 60 ఏళ్లుగా బీఎంఎస్ కార్మికుల పక్షాన ఉంటూ.. పోరాటాలు చేస్తోందని గుర్తు చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈనెల 23న నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్మికులకు కనీస వేతనం రూ. 18వేలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఈఎస్ఐ సీలింగ్ తొలగించాలని, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, అసంఘటిత కార్మికుల సామాజిక భద్రత చట్టం-2008 అమలు చేయాలి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం మండల కార్యదర్శి ధనుంజయ్, జనరల్ సెక్రటరీ యాదిరెడ్డి, నాయకులు ఆంజనేయులు, వెంకటేశ్, మహేశ్, నర్సింలు, కుమార్, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.