రాజకీయ కుట్రలకు బలయ్యేది ఎవరు?
పుల్కల్: ఇక్కడ రాజకీయ కుట్రలు ఎవరిని బలి తీసుకుంటాయో తెలియడం లేదు. గ్రామాల్లో రాజకీయ కక్షల కారణంగా పరిస్థితులు ఆందోళనకరంగా తయారవుతున్నాయి. మండల పరిధిలోని గొంగ్లూర్ పంచాయతీకి సంబంధించిన బోర్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడమే కాకుండా విద్యుత్ తీగలను స్టార్టర్ డబ్బాలకు తగిలిస్తున్నారు. ఈ దుశ్చర్యలతో పంచాయతీలో పని చేస్తున్న కార్మికుడు విద్యుత్‌షాక్ గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయినా.. రాజకీయ కక్షలు చల్లారడం లేదు.
దీంతో ఏకంగా విద్యార్థులు చదువుకునే పాఠశాల ఆవరణలోని బోరును టార్గెట్‌గా చేసుకున్నారు. అందులో భాగంగానే ఈ నెల 25న గుర్తుతెలియని వ్యక్తులు గొంగ్లూర్ జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలోని విద్యుత్ బోర్‌మోటార్ స్టార్టర్‌ను పూర్తిగా ధ్వంసం చేశారు. విద్యుత్ తీగలను కట్‌చేసి చిందరవందరగా చేశారు. బోర్ కేబుల్‌ను సైతం కత్తిరించి వదిలేశారు. దీన్ని గమనించిన విద్యార్థులు పరిస్థితిని ప్రధానోపాధ్యాయుడికి తెలిపారు. దీంతో ఆయన పాఠశాల ఆవరణలోని బోరును పరిశీలించారు.
ఒకవేళ ఈ స్టార్టర్ డబ్బాను విద్యార్థులు ముట్టి ఉంటే పెనుప్రమాదం జరిగేంది. ఈ సంఘటనకు 5 రోజుల క్రితం గ్రామ పరిధిలోని మరో బోర్‌మోటార్‌కు సంబంధించిన స్టార్టర్ డబ్బాను ధ్వంసం చేశారు. విద్యుత్ స్తంభం నుంచి వచ్చే వైర్‌ను డబ్బాకు తగిలించారు. దీంతో వాటర్సప్లైలో పనిచేసే నర్సింలు అనే పంచాయతీ కార్మికుడు బోర్ను స్టాట్ చేసేందుకు వెళ్లి విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు.
దీంతో స్థానికులు అతడిని సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇలా గ్రామంలో రాజకీయ కక్షలు పెరిగిపోతున్నాయి. దీని కారణంగా ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయంతో పంచాయతీలో పనిచేసేందుకు కార్మికులు ఎవ్వరు ముందుకు రాలేకపోతున్నారు.