కాగ్నిజంట్ తెలంగాణ సెజ్‌పై 23న నిర్ణయం
న్యూఢిల్లీ: కాగ్నిజంట్ టెక్నాలజీస్ తెలంగాణలో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక ఆర్థిక మండలి (స్పెషల్ ఎకనామిక్ జోన్-సెజ్) ప్రతిపాదనను ప్రభుత్వం ఈ నెల 23న పరిశీలించనున్నది. దీంతో పాటు మరో మూడు కొత్త సెజ్ ప్రతిపాదనలపై వాణిజ్య మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోనున్నది. ఈ సమావేశంలో వాణిజ్య కార్యదర్శి రీటా తియోతియా అధ్యక్షతన జరిగే బోర్డ్ ఆఫ్ అప్రూవల్స్(బీఓఏ) ఈ నాలుగు కొత్త ప్రతిపాదనలను పరిశీలించనున్నది. మొహాలీలో 20,23 హెక్టార్లలో ఇన్ఫోసిస్ కంపెనీ ఐటీ/ఐటీఈఎస్ సెజ్‌ను ఏర్పాటు చేస్తామని ముందుకు వచ్చింది.
కాగ్నిజంట్, ఇన్ఫోసిస్‌లతో పాటు సాల్టైర్ డెవలపర్స్, అమిన్ ప్రొపర్టీస్ ప్రతిపాదనలను కూడా బీఓఏ పరిశీలించనున్నది. ప్రాజెక్టుల అమలుకు మరింత గడువు కావాలని కోరే 12 సెజ్ ప్రతిపాదనలపై కూడా బీఓఏ చర్చించనున్నది. వీటిల్లో మహీంద్రా వరల్డ్ సిటీ(జైపూర్), జైడస్ టెక్నాలజీస్ తదితర సంస్థల ప్రతిపాదనలు ఉన్నాయి.