బీసీసీఐ అధ్యక్ష పదవిపై శ్రీనివాసన్ కన్ను
ముంబై: మరోసారి బీసీసీఐ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రస్తుత అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ స్పష్టం చేశారు. ఈమేరకు సెప్టెంబర్ 29న చెన్నైలో జరిగే బోర్డు వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశంలో జరిగే ఎన్నికల్లో తలపడతానని ఆయన చెప్పారు. గురువారం ఇక్కడ జరిగిన బోర్డు మార్కెటింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
‘అధ్యక్ష పదవికి మరోసారి పోటీపడాలనుకుంటున్నాను. మీరంతా నాకు మద్దతిచ్చినా సరే లేక వ్యతిరేకించినా సరే. అలాగే దక్షిణాది యూనిట్లతో చెన్నైలో సమావేశం జరిపినట్టు వచ్చిన వార్తలు అవాస్తవం. వేదిక గురించి మీడియాలో తప్పుగా పేర్కొన్నారు’ అని శ్రీనివాసన్ పేర్కొన్నారు.
వాస్తవానికి బోర్డు అధ్యక్ష పదవి రెండేళ్లే అయినప్పటికీ అందరి మద్దతుతో మరో ఏడాది పొడిగించుకునేందుకు నిబంధనలు సవరించారు. దీంతో శ్రీనివాసన్ మరో ఏడాది పాటు బాధ్యతలు తీసుకోవాలని భావించినా అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ బెట్టింగ్ వ్యవహారం ఆయనకు చిక్కుల్ని తెచ్చిపెట్టింది. బెట్టింగ్‌పై విచారణ పూర్తయ్యే దాకా ఆయన అధ్యక్ష బాధ్యతల నుంచి తాత్కాలికంగా తప్పుకున్నారు. మరోవైపు మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ కూడా మరోసారి బోర్డు చీఫ్ పదవిపై కన్నేశారు. అయితే ఆయనకు దక్షిణాది నుంచి కేవలం ఒక్క యూనిట్ మాత్రమే మద్దతు ఇచ్చే అవకాశం ఉంది.