సిరీస్‌కు సమస్యేం లేదు
- షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది
- విండీస్‌తో మ్యాచ్‌లపై స్పష్టత ఇచ్చిన బీసీసీఐ
న్యూఢిల్లీ: భారత్‌లో వెస్టిండీస్ జట్టు పర్యటన యథావిధిగా షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని బీసీసీఐ స్పష్టం చేసింది. విండీస్ క్రికెటర్లకు, ఆ దేశపు బోర్డుతో ఆర్థికపరమైన సమస్యలు కొనసాగుతున్నా... దీని ప్రభావం సిరీస్‌పై ఉండదని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ వెల్లడించారు. ‘తాజా సిరీస్‌కు ఎలాంటి ఇబ్బందీ లేదు. నేను విండీస్ బోర్డు అధికారులతో కూడా మాట్లాడాను. ఎలాంటి అంతరాయం ఉండదని వారు మాకు హామీ ఇచ్చారు.
సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు జరిగేలా చూడటం మా బాధ్యత. పర్యటన ముగిసిన తర్వాత విండీస్ బోర్డుకు ఏదైనా సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని ఆయన చెప్పారు. భవిష్యత్తు పర్యటన కార్యక్రమాన్ని (ఎఫ్టీఎఫ్) అందరూ గౌరవించాలని, విండీస్ ఆటగాళ్లకు వారి బాధ్యతలు తెలుసని అన్నారు. అయితే తొలి వన్డేకు ముందు విండీస్ జట్టుకు తాము డబ్బులు ఇచ్చామంటూ వస్తున్న వార్తలను ఆయన కొట్టి పారేశారు. ‘ఇది పూర్తిగా అబద్ధం. బీసీసీఐ అలాంటి చెల్లింపులు చేయలేదు. ఇలాంటి ఆర్థికపరమైన అంశాల్లో కలుగజేసుకునే ఆలోచన కూడా లేదు. అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం విండీస్ బోర్డుకు గ్యారంటీ మనీ మాత్రం ఎలాగూ చెల్లిస్తాం’ అని పటేల్ వెల్లడించారు.
ఆటగాళ్లకు విండీస్ బోర్డు కృతజ్ఞతలు
సెయింట్‌జాన్స్ (ఆంటిగ్వా): తొలి వన్డే బరిలోకి దిగి ప్రొఫెషనలిజం ప్రదర్శించిన తమ జట్టు ఆటగాళ్లకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కృతజ్ఞతలు తెలియజేసింది. మ్యాచ్ కూడా గెలుచుకున్నందుకు సంతోషం వ్యక్తం చేసింది. ‘ఆఖరి నిమిషం వరకు మా ఆటగాళ్లు మ్యాచ్ ఆడటం సందేహంగానే అనిపించింది. అయితే బ్రేవో బృందం తీసుకున్న నిర్ణయం మా అందరికీ ఆనందాన్నిచ్చింది. నంబర్‌వన్ టీమ్‌ను ఓడించడంతో సంతోషం రెట్టింపైంది’ అని విండీస్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. మరో వైపు రెండో వన్డేకు ముందు ఆటగాళ్లతో చర్చించేందుకు బోర్డు ఉన్నతాధికారులు కొందరు న్యూఢిల్లీ రానున్నట్లు సమాచారం.