కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
రామగిరి : జిల్లా కేంద్రం రామగిరి శ్రీనివాసనగర్‌లో గల వికలాంగుల వసతి గృహాన్ని శనివారం గౌరవ్ ఉప్పల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ఉన్న సమస్యలను పరిశీలించారు. ముందస్తుగా లైట్ల వసతి కల్పించాలని, మంచాలు, బెడ్‌షీట్స్, పుస్తకాలు, తదితర సామగ్రిని వెంటనే అందించాలని ప్రాధాన్యత క్రమంలో అవసరమై వస్తువులను సరఫరాచేయాలని స్త్రీ శిశు సంక్షేమశాఖ పీడీ పుష్పలతను ఆదేశించారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని అన్ని రూమ్‌లు తిరుగుతూ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ప్రాధాన్యతాక్రమంలో వసతులు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. వసతి గృహం పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. అంతకు ముందు బోయవాడలోని బాలసదన్‌ను సందర్శించి అక్కడ నెలలు మాత్రమే నిండిన చిన్నారుల ఆలనా పాలనా గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కంచర్ల యాదయ్యగౌడ్, విద్యార్థులు తదితరులున్నారు.