ఇలాంటి పోరు చూసి ఉండరు.. వైరల్
పాము, ముంగిసల పోరు గురించి తరచుగా వింటుంటాం. కానీ అందుకు భిన్నంగా పాము, ఓ పిల్లి ప్రత్యర్థులుగా మారి తమ ప్రాణాల కోసం పోరాడటం గురించి విన్నారా. అమెరికాలోని అరిజోనాలో సరిగ్గా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. రియల్ ఎస్టేట్ ఏజెంట్ లారా లక్కీ ఇటీవల ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వీడియోను దాదాపు 10 లక్షల మంది వీక్షించారు. భారీ సంఖ్యలో లైక్స్, షేర్లతో సోషల్ మీడియాలో రాటల్ స్నేక్, బాబ్ క్యాట్ (ఉత్తర అమెరికాలో ఓ రకం పిల్లి) భీకర పోరాటం వీడియో వైరల్ అవుతోంది.
కాలిఫోర్నియాకు చెందిన లారీ లక్కీ దంపతులు అరిజోనాలోని స్కాట్స్డేల్ ప్రాంతంలో కారులో ప్రయాణిస్తున్నారు. మార్గం మధ్యలో వారికి ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. పాము, పిల్లి పోరాడుతున్నాయి. కొంతసేపు గమనించిన అనంతరం ఈ తతంగాన్ని వీడియో తీశారు. తొలుత పాము ఆ పిల్లి నుంచి తన ప్రాణాలు కాపాడుకునేందుకు కాటేయాలని చూసింది. కానీ తగ్గినట్లే కనిపించిన పిల్లి ఎట్టకేలకు పాముపై పట్టు దక్కించుకుంది. ఆ పిల్లి, పామును నోటకరుచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇలాంటి పోరు ఎక్కడా చూసి ఉండరంటూ లారీ లక్కీ తన ఫేస్బుక్లో పోస్ట్ చేయగా వీడియో వైరల్ అవుతోంది.