పేదలకు లక్ష ఇళ్లు ఎక్కడ?
సాక్షి,సిటీబ్యూరో: దేశంలోనే మొదటిసారి పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభత్వం కేవలం ఐడీహెచ్ కాలనీలో 396 ఇళ్లను మాత్రమే నిర్మించిందని వైఎస్సార్ సీపీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్ రెడ్డి విమర్శించారు. జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష ఇళ్లు నిర్మిస్తామని ఎన్నికలలో హామీలు ఇచ్చినా ఇప్పటి వరకు ఆ ఊసే లేదన్నారు. రూ.583 కోట్ల మిగులు ఉన్న జీహెచ్ఎంసీని ఏడాదిన్నర ప్రత్యేక అధికారి పాలనలో దివాళా తీయించారన్నారు.
లోటు బడ్జెట్లో ఉన్న ఈ సంస్థ లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్ళను ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో కొన్ని ప్రాంతాలలో బస్తీలను ఖాళీ చేయించారని, కానీ ఆ ప్రాంతంలో నిర్మాణాలు నోచుకోలేదన్నారు. ప్రభుత్వం తక్షణమే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.