జన జాతర
జిల్లాలోని పలు ‘మినీ మేడారం’ జాతరలలో గురువారం భక్తులు పోటెత్తారు. ఇల్లెందు మండలంలోని బొజ్జాయిగూడెం; బయ్యారం మండలంలోని నంది మేడారం, నామాలపాడు; మణుగూరు మండలంలోని తోగ్గూడెం; కామేపల్లి మండలంలోని పండితాపురంలో ‘మినీ మేడారం’ వేడుకలు జరిగాయి.
బొజ్జాయిగూడెం (ఇల్లెందు), న్యూస్‌లైన్: ‘మినీ మేడారం’ బొజ్జాయిగూడెం వనంలో గురువారం మధ్యాహ్నం నుంచే జనం పోటెత్తారు. బుధవారం సారలమ్మ, గురువారం సమ్మక్క ఆగమనంతో భక్తులు భక్తిపరవశులయ్యారు. గురువారం సాయంత్రం గంటలు 5:05 గంటలకు సమ్మక్కను గిరిజన పూజారులు, వడ్డెలు బొజ్జాయిగూడెం సమీపంలోని ముసలమ్మ గుట్టల నుంచి వనానికి తీసుకొచ్చారు.
అనేకమంది భక్తులు బంగారం (బెల్లం) చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. కోరికలు నెరవేర్చాలని దేవతను వేడుకుంటూ గద్దెల వద్దనున్న చెట్టుకు ముడుపులు కట్టారు. మరికొంత మందరు జంతువులను బలి ఇచ్చారు. ఇం కొందరు తల నీలాలు సమర్పించారు. సమ్మక్క రాక కోసం గంటలతరబడి నిరీక్షిం చారు. జాతరలోని దుకాణాలు కిటకిటలాడాయి. కొందరు భక్తులు పూనకాలతో తూలారు. ఇల్లెందు-కొత్తగూడెం ప్రధాన రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది.
తోగ్గూడెంలో..
మణుగూరు: మణుగూరు మండలం తోగ్గూడెం గ్రామ సమీపంలోని రథం గుట్ట అటవీ ప్రాంతం జనసంద్రమైంది. సమ్మక్కను గురవారం సాయంత్రం గిరిజన పూజారులు గద్దెనెక్కించారు. జాతరకు మణుగూరు, పినపాక, అశ్వాపురం, బూర్గంపాడు మండలాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద మొక్కులు తీర్చుకున్నారు. వైఎస్సార్ సీపీ నేత పాయం దంపతులు పూజలు చేశారు.