సీసీఎల్ విజేత తెలుగు వారియర్స్
విశాఖ స్పోర్ట్స్: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) విజేతగా తెలుగు వారియర్స్ నిలిచింది. విశాఖలోని వైఎస్సార్ స్టేడియంలో శనివారం రాత్రి భోజ్‌పురి దబాంగ్ జట్టుతో జరిగిన ఫైనల్లో పోటీలో తెలుగు వారియర్స్ జట్టు అదరగొట్టింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన దబాంగ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను పది ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. ఆదిత్య 26, అస్గర్ 11 పరుగులు చేశారు. వారియర్ నందకిషోర్ రెండు వికెట్లు తీశాడు.
ప్రతిగా బ్యాటింగ్ చేసిన తెలుగు వారియర్స్ 4 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగుల ఆధిక్యం సాధించింది. ఓపెనర్ అఖిల్ 67 పరుగులతో రాణించాడు. తరువాత రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన దబాంగ్ ఆరు వికెట్లకు 89 పరుగులు చేసింది. 58 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన తెలుగు వారియర్స్ 6.1 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టపోయి విజయలక్ష్యాన్ని సాధించింది. అశ్విన్ 31 పరుగులు చేశాడు. స్పాన్సర్ల ద్వారా పాస్‌లతో అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు.
ఫైనల్స్‌లో తెలుగు వారియర్స్ ఆడుతుండడంతో తమ అభిమాన తారల ఆటను వీక్షించేందుకు తరలివచ్చారు. జట్టు మెంటర్ వెంకటేష్ అభిమానులను ఉత్సాహాపరిచాడు. రాష్ట్ర మంత్రి అమర్నాథ్ బాక్స్‌లో కూర్చొని మ్యాచ్‌ను వీక్షించారు. వారియర్స్ జట్టుతో కలిసి తొలి ఇన్నింగ్స్ ముగియగానే అభివాదం చేసి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు.