‘స్వచ్ఛ గోదావరి’ కోసం సైకిల్‌యాత్ర
భద్రాద్రి చేరిన హైదరాబాద్ యువకుడు
భద్రాచలం: గోదావరి తీరాల పరిశుభ్రత లక్ష్యంగా హైదరాబాద్ బొల్లారం మేఘన రెసిడెన్సీకి చెందిన ఎ.శివశంకర్ అనే వ్యక్తి సైకిల్‌యాత్ర నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఆయన భద్రాచలం చేరుకున్నారు. స్నానఘట్టాల రేవులో ఉన్న భక్తులకు నీటి కాలుష్య నివారణ గురించి అవగాహన కల్పించారు. భక్తుల వద్దకు వెళ్లి గోదావరి నదిలో వ్యర్థ పదార్థాలు పడేయవద్దని కోరారు. అలా చేస్తే భవిష్యత్‌లో గుక్కెడు నీళ్లు కూడా తాగేందుకు ఉపయోగపడవని తెలిపారు. గోదావరి తీరాన ఉన్న పుణ్యక్షేత్రాలతో కూడిన చార్టు, స్వచ్ఛ గోదావరి- సంరక్షణ యాత్ర అంటూ రాసిన లోగోలతో ఉన్న చార్టులను అందరికీ కనిపించేలా సైకిల్‌కి తగిలించి తిరిగారు. గ్రీన్ భద్రాద్రి నిర్వాహకులు భూపతిరావు ఆయనకు ఆతిథ్యమిచ్చారు.
గోదావరి తీరాల పరిశుభ్రతే లక్ష్యం..
ఈ నెల 12న హైదరాబాద్‌లో సైకిల్ యాత్ర చేపట్టా. ఇప్పటి వరకు 750 కిలోమీటర్లు తిరిగా. గోదావరి తీరాన ఉన్న బాసర, ధర్మపురి, కాళేశ్వరం మీదగా భద్రాచలం వచ్చా. రోజుకు 80 కిలోమీటర్ మేర ప్రయాణిస్తూ మార్గమధ్యంలో స్వచ్ఛంద సంస్థలను కలుస్తూ, పాఠశాలల్లోని విద్యార్థులకు అవగాహన కలిస్తున్నా. 1818 కిలోమీటర్ మేర యాత్రను సాగించి గోదావరి నది చివరన ఉన్న అంతర్వేదితో ముగిస్తా. - ఎ.శివశంకర్