ఖాళీ జాగా.. వేసై పాగా
మండలంలోని బొల్లారం జిల్లాలోనే అతిపెద్ద మేజర్ పంచాయతీ. హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉండడం, దీనికి తోడు పారిశ్రామికంగా బొల్లారం అభివృద్ధి చెందుతుండడంతో భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఎకరా స్థలం విలువ సుమారు రూ. 2 కోట్ల వరకు ఉంటుంది. బొల్లారం ప్రాంతంలో సుమారు వె య్యి ఎకరాల వరకు ప్రభుత్వ భూములుంటాయి. ఇందులో 172 ఎకరాల స్థలాన్ని నాలుగేళ్ల క్రితం అధికారులు హుడాకు కేటాయించారు. ఇలా హుడాకు కేటాయించిన స్థలంతో పాటు, బొల్లారం రెవెన్యూ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములపై కబ్జాదారుల కన్ను పడింది.
అందులో భాగంగానే వైఎస్సార్ కాలనీలో పార్కు కోసం కేటాయించిన సుమారు నాలుగు ఎకరాల స్థలాన్ని కబ్జా చేసేందుకు నాయకులు సిద్ధపడ్డారు. స్థలం చుట్టుపక్కల ఇప్పటికే కొన్ని నిర్మాణాలు చేపట్టగా, మరికొంత కబ్జా చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
దీని విలువ సుమారు రూ. 10 కోట్ల వరకు ఉంటుంది. స్థానికంగా ఉన్న చెరువులను కూడా ఇక్కడి అధికార పార్టీ నేతలు కబ్జాలు చేసేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు చొరవ తీసుకుని ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.